తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని స్పష్టం చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ , పుష్పాలంకరణలు చేయాలని సూచించారు. అలాగే కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి సేవకులు, పోలీస్ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
వేసవి దృష్ట్యా కళ్యాణ వేదిక వద్ద నీటితో పిచికారీ చేయాలని, వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పార్కింగ్ సమస్యలు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు ఏఈవో. గ్యాలరీల్లో నిర్వహణ పటిష్టంగా ఉండాలని, ప్రతి గ్యాలరీలో అన్న ప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులు , సంబంధిత అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యాలు ప్రణాళికాబద్ధంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వెంకయ్య చౌదరి. మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు పోలీసుల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది, శ్రీవారి సేవకులు ఈ నెంబర్ ద్వారా సేవలు అందించాలని కోరారు.
The post ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలు
Categories: