hyderabadupdates.com movies ఓట‌మికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే

ఓట‌మికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తామ‌నిప్ర‌క‌టించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఆశించిన విధంగా ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేక పోయారు. క‌నీసం 234 మంది అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా ఒక్క చోట కూడా.. ఆయ‌న డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. అయితే.. ఓట్లు మాత్రం 3.3 శాతం వ‌చ్చాయి. ఇవి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీల కూటమిని చావు దెబ్బ కొట్టాయ‌న్న చ‌ర్చ ఉంది. అయితే.. పీకే ప్రారంభించిన జ‌న్ సురాజ్ పార్టీ తొలి అంకంలోనే ప‌రాజ‌యం పాల‌వ‌డం.. రాజకీయ వ్యూహ‌క‌ర్త‌గా కూడా ఆయ‌న‌పై మ‌ర‌క‌లు పడేలా చేసింది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించిన పీకే.. దేశ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌పంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకువ‌చ్చిన నిధుల‌ను బీజేపీ రాష్ట్రంలో ఎన్నిక‌ల కోసం మ‌ళ్లించింద‌ని ఆరోపించారు. ఏకంగా 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి ఓట్ల‌ను కొనుగోలు చేసింద‌ని పీకే చెప్పారు. అయితే.. దీనిపై ఎదురు విమ‌ర్శ‌లు ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. ఇదిలా వుంటే.. తాజాగా మ‌రోసారి మంగ‌ళ‌వారం స్పందించిన పీకే.. ఈ ఎన్నిక‌ల్లో జ‌న్ సురాజ్ పార్టీ ఘోర ప‌రాజ‌యానికి తానే కార‌ణమ‌ని.. తానే బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్య‌ర్థుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు.

వారు ఎంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌చారం చేశార‌ని.. వారి క‌ష్టం వృథా పోద‌ని తెలిపారు. కొంద‌రు అప్పులు చేసి మ‌రీ.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఖ‌ర్చుచేశార‌ని పీకే వ్యాఖ్యానించారు. త‌న అభ్య‌ర్థుల‌తోనూ తాను త్వ‌ర‌లోనే భేటీ కానున్న‌ట్టు పీకే వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ.. ప్రాయశ్చిత్తంగా ఈ నెల 20న గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒకరోజు మౌన ఉపవాస దీక్ష చేయనున్నట్లు పీకే ప్ర‌క‌టించారు. బీహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త పాత్ర పోషించామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌లు త‌మ‌ను అర్ధం చేసుకునేలా ప్ర‌చారం చేయలేక పోయామ‌న్నారు.

దీనికి త‌న‌దే బాధ్య‌త‌ని ప్ర‌క‌టించారు. త‌మ ఆలోచ‌న‌ల్లోనే ఎక్క‌డో లోపం ఉంద‌న్నారు. కానీ, ఎన్నిక‌ల పోరులో నిజాయితీగా ప్ర‌య‌త్నం చేశామ‌ని చెప్పారు. కానీ.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం పొంద‌లేక పోయామ‌ని తెలిపారు. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన వాళ్లం కాద‌న్న పీకే.. గ‌త మూడేళ్లుగా బీహార్ ఎన్నిక‌ల‌పై క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు చెప్పారు. అయినా.. ఫ‌లితం ద‌క్క‌లేద‌ని చెప్పారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న్ సురాజ్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు విక‌టించాయి. వీటిలో ఒక‌టి.. రాష్ట్రంలో కొన్ని ద‌శాబ్దాలుగా అమ‌ల్లో ఉన్న మ‌ద్య నిషేధం ఎత్తేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిని మెజారిటీ ప్ర‌జ‌లు స్వీక‌రించ‌లేదు.

Related Post