రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల వెనుక చాలా నిగూఢమైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలకు మరింత అర్ధం-పరమార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా.. ఈ తరహాలోదేనన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే ప్రచారం చేస్తున్నాయి. అయితే.. అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు.. మరో రెండు రోజుల్లోనే అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తారన్న ప్రచారమూ ఉంది.
ఇంత సడెన్ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మైనారిటీ ఓట్లను దూసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కానీ.. ఇది కొంత వెనుకబడింది. దీంతో కీలకమైన మైనారిటీ నాయకుడిగా.. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అజారుద్దీన్‌కు అవకాశం ఇవ్వడం.. మంత్రిపీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటే.. ఎన్నికల్లో అంతో ఇంతో మైనారిటీ వర్గాలను చేరువ చేసుకునే అవకాశం ఉందన్న భావనతోనే కాంగ్రెస్ పార్టీ ఇలా ఆకస్మిక నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పుడు అజారుద్దీన్ శాసన సభ్యుడుకాదు. పోనీ.. శాసన మండలి సభ్యుడా అంటే.. అది కూడా కాదు. గత 2023 ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక, ఇటీవల ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు మొదలుపెట్టలేదు. దీంతో ఆయన రెండు సభల్లోనూ సభ్యుడు కాదు. అయినా.. ఆయనను మంత్రిగా ప్రమోట్ చేయడం వెనుక పైన చెప్పిన రీజన్లే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇక, రేవంత్ మంత్రివర్గంలో 18 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన పోస్టులు భర్తీ చేస్తున్నారని అనుకున్నా.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం..కేవలం అజారుద్దీన్ కోసమే. మిగిలిన రెండు పోస్టుల ఊసే లేదు.
కాబట్టి ఇలా.. చూసుకున్నా.. అజారుద్దీన్‌ను మంత్రి పీఠంపైకి ఎక్కించడం వెనుక.. ఎన్నికలే కారణమని తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన మంత్రి పీఠం ఎక్కినా.. ఇబ్బంది లేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఆరుమాసాల్లో చట్ట సభలకు ప్రాతినిధ్యం చూపించాలి. సో.. వచ్చే ఆరు మాసాల్లో మండలి సీట్లు మూడు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ఆయనను ఆ ఖాళీలలో ఒక దాని నుంచి మండలికి పంపించే అవకాశం ఉంటుంది. దీనిని బట్టి ఇప్పటికిప్పుడు అజారుద్దీన్‌ను మంత్రిని చేయడం వల్ల రాజ్యాంగపరమైన.. చట్టపరమైన ఇబ్బందులు కూడా లేవు. సో.. అన్నీ ఆలోచించుకునే అజారుద్దీన్‌కు అవకాశం ఇచ్చేలా ఆకస్మిక నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు.