hyderabadupdates.com movies కార్తీ సినిమాకు ఇన్ని కష్టాలేంటబ్బా

కార్తీ సినిమాకు ఇన్ని కష్టాలేంటబ్బా

స్టార్ హీరో సూర్య తమ్ముడిగా పరిచయమైనా మొదటి సినిమా పరుత్తి వీరన్ తోనే తానేంటో ఋజువు చేసుకున్న కార్తీకి తెలుగులోనూ మార్కెట్ ఉంది. ఈ మధ్య వరస ఫ్లాపుల వల్ల కొంచెం వెనుకబడ్డాడు కానీ సరైన బ్రేక్ దొరికితే మళ్ళీ పుంజుకుంటాడు. ఇంత ఇమేజ్ ఉన్న కార్తీకి బిజినెస్ పరంగా ఇబ్బందులు లేవు. నిర్మాతలకు డీల్స్ బాగానే జరుగుతాయి. కానీ ఒక మూవీ విషయంలో మాత్రం రివర్స్ లో అవుతోంది. 2023లో ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టిన చిత్రం వా వాతియర్. సూదు కవ్వం లాంటి క్లాసిక్ ఇచ్చిన నలన్ కుమారస్వామి దర్శకుడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం.

గత ఏడాది టైటిల్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయడం, వాయిదా వేయడం పరిపాటిగా మారింది. మొన్నెప్పుడో డిసెంబర్ 5 అన్నారు. ఇప్పుడా డేట్ కి రావడం అనుమానమే. ఎదురుగా అఖండ 2 పెట్టుకుని రిస్క్ అనుకోలేదు కానీ ఏవో ఆర్థిక కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ తప్పలేదట. ఓటిటి హక్కులకు అనుకున్న మొత్తం రాకపోవడం వల్లే నిర్మాత ధైర్యం చేయలేకపోతున్నాడని ఒక టాక్ ఉంది. ప్రొడ్యూసర్ ఎవరో కాదు. స్వయానా కార్తీ కుటుంబ సభ్యుడు జ్ఞానవేల్ రాజా. కంగువతో అందరికీ ఖంగు తినిపించిన ఈయన్ని ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోరు.

ఇప్పుడా కంగువ తాలూకు ఎఫెక్ట్ వా వాతియర్ మీద పడిందని చెన్నై టాక్. కార్తీ గత సినిమాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోవడం, జపాన్ లాంటివి మరీ దారుణంగా డిజాస్టర్ కావడం డిజిటల్ కంపెనీలను వెనుకడుగు వేసేలా చేస్తున్నాయట. మరి ఎప్పుడు మోక్షం దక్కుతుందో అంతు చిక్కడం లేదు. సంక్రాంతికి పోటీ దృష్ట్యా ఛాన్స్ లేదు. జనవరి ఆఖరున సూర్య కరుప్పు వచ్చేలా ఉంది కాబట్టి అన్నకు పోటీగా తమ్ముడు వెళ్ళడు. నెక్స్ట్ ఫిబ్రవరి చూడాలి.  హుషారైన పోలీస్ ఆఫీసర్ గా కార్తీ నటించిన కామెడీ యాక్షన్ డ్రామాలో ఏముందో కానీ ముందీ నెగటివ్ వైబ్స్ తగ్గడానికి ఏదో ఒకటి చేయాలి.

Related Post