క్రైమ్ థ్రిల్లర్ చేస్తే కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో 12ఏ రైల్వేకాలనీలో నటించిన అల్లరి నరేష్ కు పెద్ద డిజాస్టరే మిగిలింది. రెండో వారానికే వాషౌట్ కావడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఆ ఒక్కటి అడక్కు లాగా కామెడీ చూపిస్తే జనాలు నో అన్నారు. కల్ట్ డ్రామా అంటూ బచ్చల మల్లితో హడావిడి చేస్తే తిరస్కరించారు. మెసేజ్ ఇద్దామని ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తే అసలది వచ్చిన సంగతే జనాలకు గుర్తు లేదు. రివెంజ్ ఫార్ములా పనికొస్తుందేమోనని ఉగ్రంలో ఉగ్ర రూపం ధరిస్తే దానికీ తిరస్కారం ఎదురయ్యింది. అల్లరోడు తన వంతు కృషి లోపం లేకుండా అన్ని జానర్లు ట్రై చేస్తున్నాడు కానీ ఫలితం మాత్రం శూన్యమే.
నెక్స్ట్ అల్లరి నరేష్ నుంచి వస్తున్న సినిమా ఆల్కహాల్. అప్పుడెప్పుడో టీజర్ వచ్చి విడుదల తేదీన 2026 జనవరి 1 అని ప్రకటించేశారు. సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంటుందని తెలిసి కూడా పది రోజుల థియేటర్ రన్ చాలనుకుని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడీ డెసిషన్ ని మార్చుకోవచ్చని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే ఇది కూడా ఎక్స్ పరిమెంటల్ మూవీనే. వెరైటీ పాయింట్ తీసుకున్నారు. అలాంటప్పుడు మంచి టైం చూసి సోలోగా రిలీజ్ చేయాలి. నిర్మాణ సంస్థ సితార ఏమో జన నాయకుడు డిస్ట్రిబ్యూషన్ తో పాటు అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో తలమునకలై ఉంటుంది. సో ఆల్కహాల్ మీద ఫోకస్ కష్టం.
ఇంకా వాయిదా వార్తలు లాంటివి చెప్పలేదు కానీ డేట్ మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా రైల్వేకాలనీ ఎఫెక్ట్ గట్టిగా పడటం వల్లే కొంచెం గ్యాప్ ఇద్దామని అల్లరి నరేష్ భావిస్తున్నాడట. ఏమైనా ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండి వేగంగా యాభై సినెమాలు పూర్తి చేసిన ట్రాక్ రికార్డు ఉన్న అల్లరోడికి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. పోనీ మహర్షిలో చేసిన పాత్రలు కొనసాగిద్దామంటే అందరూ అవే ఆఫర్లు ఇచ్చి సపోర్టింగ్ ఆర్టిస్టుని చేస్తారు. అందుకే ఈ విషయంలో అల్లరి నరేష్ జాగ్రత్తగానే ఉన్నాడు. మరి ఆల్కహాల్ చెప్పిన తేదీకి తీసుకొస్తాడో లేదో చూడాలి.