hyderabadupdates.com movies కాళేశ్వరంపై బాంబులు వేసినట్టు కేటీఆర్ అనుమానం

కాళేశ్వరంపై బాంబులు వేసినట్టు కేటీఆర్ అనుమానం

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పాల‌న‌ను `మాఫియా`తో పోల్చారు. “ఇది ప్ర‌జాపాల‌న కాదు.. ప‌క్కా మాఫియా పాల‌న‌“ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించేందుకు కాంగ్రెస్ నాయ‌కులు చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌ని వ్యాఖ్యానించారు. గ‌త 2023 ఎన్నిక‌ల ముందు.. బ‌హుళార్థ సాథ‌క ప్రాజెక్టు అయిన‌.. కాళేశ్వ‌రంపై బాంబులు వేశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అందుకే.. అది దెబ్బ‌తింద‌న్న అనుమానాలు కూడా ఉన్నాయ‌ని కేటీఆర్ చెప్పారు. ఇక‌, ఇప్పుడు ఇసుక మాఫియా చెల‌రేగిపోతోంద‌ని విమ‌ర్శించారు. చెక్ డ్యాముల మీద జిలెటిన్ స్టిక్స్ వేస్తున్నార‌ని ఆరోపించారు. “ఇది మానవ నిర్మిత విధ్వంసం“ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘వాటర్‌ మ్యాన్‌’ గా పేరొందిన రాజేంద్రసింగ్ కూడా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ప్రాజెక్టుల‌ను నాశ‌నం చేస్తున్నార‌ని చెబుతున్నార‌ని తెలిపారు. అయినా.. ఈ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంద‌న్నారు.

ఇసుక త‌వ్వ‌కాల కోసం.. ప్రాజెక్టుల‌పై రంధ్రాలు చేసి.. జిలెటిన్ స్టిక్స్‌ను పెట్టి పేల్చార‌ని కేటీఆర్ ఆరోపిం చారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని.. కోట్ల రూపాయ‌లు ప్ర‌జ‌ల సొమ్ముతో చేప‌ట్టిన చెక్‌డ్యామ్‌లను పేల్చేస్తున్నార‌ని తెలిపారు. “భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్‌డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి పొలాలను ఎడారిగా మారుస్తున్నారు.“ అని ఆరోపించారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తూ ఊరుకునేది లేద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికిత‌గిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు.

Related Post