hyderabadupdates.com movies కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!

కొండా కోన‌ల్లో.. లోయ‌ల్లో.. పోలింగ్ కేంద్రాలు ఇవే!

సాధార‌ణంగా జ‌నావాసాలు ఉండే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డం తెలిసిందే. ఆయా కేంద్రాల‌కు ఎన్నిక‌ల సిబ్బంది చేరుకోవ‌డం.. పోలింగ్ యంత్రాల‌ను త‌ర‌లించ‌డం కూడా పెద్ద క‌ష్టం కాదు. ఇక‌, భ‌ద్ర‌తా ప‌రంగా కూడా భారీ సంఖ్య‌లోనే పోలీసుల‌ను మోహ‌రిస్తారు. అయితే.. కొన్ని కొన్నిసార్లు ఇవే స‌మ‌స్యాత్మ‌కంగా మారుతున్నాయి. అనేక ఇబ్బందులు తీసుకువ‌స్తున్నాయి. అయితే.. అస‌లు న‌డిచేందుకు దారి కూడా లేని ప్రాంతాలు.. పులుల కోసం ఏర్పాటు చేసిన అభ‌యార‌ణ్యాల‌ను కూడా దాటుకుని వెళ్లి పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల్సి వ‌స్తే.! ఊహించ‌డం కూడా క‌ష్టం క‌దా!!.

కానీ, వాస్త‌వమే!!. ఇలాంటి ప్రాంతాలు దేశంలో చాలానే ఉన్నాయి. గిరిజ‌నులు, న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల‌కు సుదూరంగా నివ‌సించే ఆదివాసీలకు కూడా ఓటు హ‌క్కు ఉంది. దీంతో వారి సౌక‌ర్యం కోసం.. అనేక వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తోంది. వాస్త‌వానికి గ‌తంలో ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కు ఇలాంటి ప్రాంతాల‌ను ప‌క్క‌న పెట్టేవారు. వారినే నేరుగా స‌మీపంలోనిపోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేసేవారు. కానీ, ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని పెద్ద‌గాఎవ‌రూ ప‌ట్టించుకునే వారు. దీంతో ఇప్పుడు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌లోనూ పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్క‌డెక్క‌డ.. ఎలా ఎలా?

+ ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల్లోనూ అత్యంత సంక్లిష్ట ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే.. ఆయా కేంద్రాల ప‌రిధిలో ఉన్న ఓట‌ర్లు 500 మంది లోపే. అయిన‌ప్ప‌టికీ..ఓటు హ‌క్కును క‌ల్పించేందుకు అధికారులు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఒక‌ప్పుడు ఓట‌ర్లు నానా తిప్ప‌లు ప‌డి పోలింగ్ కేంద్రాలు వ‌స్తే.. ఇప్పుడు అవే తిప్ప‌లు ప‌డి.. అధికారులు వారు ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

+ త‌మిళ‌నాడులోని తేని జిల్లాలో చిత్ర‌మైన ప్రాంతం ఉంది. అదే వరుస‌నాడ్‌. ఇక్క‌డంతా కొండ‌లే. దారి అనే మాటే లేదు. కొండ‌లు ఎక్కి దిగాల్సిందే. న‌గ‌రానికి కేవ‌లం 4 కిలో మీట‌ర్ల దూరంలోనే ఉన్నా.. అత్యంత క‌ఠిన‌మైన దారి. ఇక్క‌డ కేవలం ఐదుగురు ఓట‌ర్ల కోసం.. పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.  

+ రోడ్డు ప్ర‌యాణం అనంత‌రం.. సుమారు 50 కిలో మీట‌ర్లు న‌దిలో ప్ర‌యాణిస్తే వ‌చ్చే దానేఖానా ప్రాంతంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉంది.ఇక్కడ ఉన్న ఓటర్లు 248 మంది మాత్ర‌మే.

+ కేర‌ళ‌లోని ఓ గిరిజ‌న ప్రాంతం ఎడ‌మ‌ళ‌కుడి. ఇక్క‌డ‌కు చేరుకునేందుకు రోడ్డు మార్గం కానీ.. జ‌ల మార్గం కానీ లేదు. అంతా అడివి. పైగా చుట్టుప‌క్క‌ల కూడా ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం. కానీ, 690 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరి కోసం.. పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

+ పులుల అభ‌యార‌ణ్యం మీదుగా న‌డుస్తూ.. ముందుకు సాగితే వ‌చ్చే బ‌క్సా ప్రాంతంలో 750 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరి కోసం అంత సాహ‌సం చేసేందుకు ఎన్నిక‌ల అధికారులు ముందుకు వ‌చ్చారు. ఈ ప్రాంతం ప‌శ్చిమ బెంగాల్‌లో ఉంది. సో.. ఇలా..అనేక సాహ‌సాలు చేస్తూ..ఎన్నిక‌ల క్ర‌తువును స‌జావుగా న‌డిపించేందుకు ఓటు హ‌క్కు ఉన్న వారికి న్యాయం చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌య‌త్నిస్తుండ‌డం అభినంద‌నీయ‌మని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Post