కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్, ఓజిలు చూసేసి కొత్త సినిమాల కోసం అర్రులు చాచిన మూవీ లవర్స్ కి నిన్న శుక్రవారం ఏ మాత్రం కిక్ ఇవ్వలేకపోయింది. అంతంత మాత్రం అంచనాలతో వచ్చిన శశివదనే, అరి, కానిస్టేబుల్ వగైరాలు నీరసమైన ఓపెనింగ్స్ తో పాటు పబ్లిక్ టాక్, రివ్యూస్ సోసోగానే తెచ్చుకున్నాయి. చాలా చోట్ల సాయంత్రం షోలు పడ్డాయో లేదోననే అనుమానాలు ట్రేడ్ లో వ్యక్తమవుతున్నాయి. సరే థియేటర్ మాల్ ఎంత నీరసంగా ఉన్నా ఓటిటిలో మాత్రం చెప్పుకోదగ్గ కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంట్లో వినోదానికి లోటు లేకుండా ఆడియన్స్ తో టైం పాస్ చేయిస్తోంది.
తేజ సజ్జకు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్ ‘హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కేవలం నాలుగు వారాల విండోని ఫాలో కావడంతో స్మార్ట్ స్క్రీన్ మీద సంచలనం సృష్టించడం ఖాయమనేలా ఉంది. నూటా యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మిరాయ్ బుల్లితెరపై కూడా సెన్సషన్ గా నిలవడం ఖాయం. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకున్నప్పటికీ ‘వార్ 2’ని బిగ్ స్క్రీన్ మీద మిస్ అయినవాళ్లు చాలా ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక కోసం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు. హక్కుల కోసం భారీ మొత్తం వెచ్చించిన నెట్ ఫ్లిక్స్ కు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
బిగ్ స్క్రీన్ దగ్గర ఫెయిలై మెప్పించలేకపోయినా ‘త్రిబాణధారి బార్బరిక్’ రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచింది. ఫాంటసీ కం క్రైమ్ థ్రిల్లర్ కావడంతో దీనికీ మంచి వ్యూస్ వచ్చేలా ఉన్నాయి. అమెజాన్ తో పాటు సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి వచ్చింది. పది ఎపిసోడ్ల యానిమేషన్ సిరీస్ ‘కురుక్షేత్ర’ని భారీగా ప్రోమోట్ చేస్తోంది నెట్ ఫ్లిక్స్, విజువల్స్ లో క్వాలిటీ, ఎర్లీ రిపోర్ట్స్ చూస్తుంటే పాజిటివ్ గానే కనిపిస్తోంది. కొంకణాసేన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సెర్చ్’ అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇవి కాకుండా కన్నడ, ఇంగ్లీష్, హిందీ, కొరియన్ తదితర భాషల్లో సుమారు ఇరవైపైగా ఓటిటి రిలీజులున్నాయి.