తెలంగాణ అభివృద్ధికి, విజన్-2047 సాకారానికి `క్యూర్-ప్యూర్-రేర్` అనే మంత్రులను పఠిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విజన్ తెలంగాణ-2047లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని తెలిపారు. 1) విజన్, 2) వ్యూహం. ఈ రెండు ప్రధాన అంశాలను సాకారం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. సంపదను సృష్టించి..పేదలకు పంచేకార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. దీనికిగాను పెట్టుబడులను ఆహ్వానించాలని పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ఆదివారం రాత్రి ఆయన సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సహా ఇతరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. డిసెం బరు 8, 9 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి సదస్సులో ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారన్న విషయంపై ఆయన వివరిం చారు. తెలంగాణను మరో రేంజ్‌కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానిస్తున్నామని, హైదరాబాద్‌ను మరో స్థాయి నగరంగా విస్తరించడంతోపాటు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. రాష్ట్రంలో గత అనుభవాల(విభజన కావొచ్చు) నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణ విజన్-2047 పాలసీని ఓ అద్భుతమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిని ఈ నెలలో జరగనున్న సదస్సులో జాతికి అంకితం చేస్తామని తెలిపారు. తెలంగాణ అంటే.. తిరుగులేని ఆర్థిక శక్తికి నిదర్శనమని తెలిపారు. విజన్ డాక్యుమెంటు లో కీలకమైన రెండు అంశాలు ఉన్నాయని.. వాటిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. విజన్, వ్యూహం.. ఈ రెండు అభివృద్ధికి కీలక పాత్ర పోసిస్తాయన్నారు. విధానపరమైన పక్షవాతం లేకుండా, రాకుండా చూసుకుంటామన్నారు. తద్వారా ప్రభుత్వం ప్రవచించిన విధానాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంటులో నీతి ఆయోగ్ సహా ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయనున్నట్టు వివరించారు.
పేదరికం తగ్గిస్తాం..
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది సవాలుతో కూడుకున్న విధానమని సీఎం చెప్పారు. దీనికిగాను సంపద సృష్టికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. పేదలకు ఆ సంపదను పంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని 2034 నాటికి లక్ష కోట్ల రూపాయలు(ఒక ట్రిలియన్), 2047 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మార్చనున్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణకు కీలక పాత్ర ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా క్యూర్-ప్యూర్-రేర్ పాలసీలను తీసుకువస్తామని.. అన్ని విభాగాలు, శాఖలకు దీనిని వర్తింపచేస్తామని వివరించారు.