దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర పోషించిన నాయకుడు నారా చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండో టర్మ్ సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పాలన తీరు చూస్తే ఇంకో పర్యాయం కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో రసవత్తర మలుపులు.. ఎత్తుపల్లాలు ఉన్నాయి. అన్నిటినీ దాటి దేశ రాజకీయాల్లో ఒక శిఖరంలా నిలబడ్డారాయన. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని సరిగ్గా వెండితెరపై చూపిస్తే అదొక మైల్‌స్టోన్ మూవీలా నిలిచే అవకాశముంది.
కానీ ఇప్పటిదాకా అలాంటి మంచి ప్రయత్నం ఏదీ జరగలేదు. చంద్రబాబును గొప్ప నాయకుడిగా చూపిస్తూ ‘చంద్రోదయం’ సహా కొన్ని సినిమాలు వచ్చాయి. అలాగే ఆయన్ని బ్యాడ్‌లైట్‌లో చూపించిన చిత్రాలూ ఉన్నాయి. కానీ చంద్రబాబు మీద అథెంటిక్, గ్రాండ్ బయోపిక్ అయితే రాలేదు.
ఇప్పుడు దర్శకుడు భాను శంకర్ ఇదే ప్రయత్నం చేయబోతున్నారు. చంద్రబాబు మీద పాన్ వరల్డ్ స్థాయిలో ఒక భారీ బయోపిక్ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ‘ఎవరే అతగాడు’ సహా కొన్ని సినిమాలు తెరకెక్కించారు భాను శంకర్. ఆపై కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. కొన్నేళ్ల ముందు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండగా.. ఆయన ‘రాజధాని ఫైల్స్’ మూవీతో వార్తల్లో నిలిచారు.
అమరావతి రైతులకు మద్దతుగా.. అప్పటి ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా ప్రోమోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జనాలను థియేటర్లకు రప్పించింది. కానీ సినిమా ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే ‘రాజధాని ఫైల్స్’ ద్వారా తెలుగుదేశం నేతల దృష్టిలో పడ్డట్లే ఉన్నాడు భాను శంకర్.
బాబు మీద సినిమా తీస్తానంటే భారీ మొత్తంలో ఫండింగ్ చేయడానికి నేతలు ముందుకు వస్తారనడంలో సందేహం లేదు. ఐతే చంద్రబాబు మీద ఇంతకుముందు తీసిన సినిమాల్లా కాకుండా.. భానుశంకర్ అండ్ టీం సరిగ్గా రీసెర్చ్ చేసి, ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయగలరేమో చూడాలి.