హైదరాబాద్ : బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టి. చిరంజీవులకు “మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026” దక్కింది. ఈ సందర్భంగా తనపై ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచేలా చేసిందన్నారు. ఇదిలా ఉండగా సమ సమాజ స్థాపన కోసం కుల ఆధారిత అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన మహానీయ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వి. హనుమంతరావు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు పూలే చేసిన కృషి అపారమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ శాసనసభ తొలి సభాపతి, శాసనమండలి సభ్యులు సిహెచ్ మధుసూదనాచారి మాట్లాడుతూ పేదల మరియు శూద్రుల హక్కుల కోసం పోరాడిన పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆయన జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని కోరారు.
రిటైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్ పూర్ణచందర్రావు మాట్లాడుతూ చదువు అనే ఆయుధంతో సామాజిక గౌరవాన్ని సాధించడంలో పూలే ప్రేరణగా నిలిచారని అన్నారు. అదే మార్గంలో టి. చిరంజీవులు బీసీ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ పొలిటికల్ ఫ్రెండ్స్ చైర్మన్ బి. బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని పేర్కొన్నారు. తెలంగాణ బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ టి. చిరంజీవులు మాట్లాడుతూ బీసీ ఐక్యత కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని అన్నారు. పోరాటాల ద్వారా హక్కులను సాధించేందుకు అన్ని వర్గాలను ఒకే వేదిక పైకి తీసుకు వస్తానని అన్నారు. తాను రచించిన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా. రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిభావంతుడైన ఒకరికి ప్రదానం చేసే “మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026” కు ఈ సంవత్సరం బీసీ మేధావుల ఫోరం చైర్మన్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నామని తెలిపారు.
The post చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
చిరంజీవులకు మహాత్మ జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు
Categories: