ఆయన పోలీసు అధికారి. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు పోలీసు విధులను సక్రమంగా వ్యవహరించేస్థాయిలో ఉన్న సబ్ ఇన్స్‌పెక్టర్. బెట్టింగులకు, జల్సాలకు పాల్పడుతూ.. సమాజానికి ఇబ్బందికరంగా ఉన్న వారిని దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత ఉన్న అధికారి!. కానీ.. తానే దారి తప్పితే?! .. ఇక, సమాజం పరిస్థితి ఏంటి?!. ఇప్పుడు అదే జరిగింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారే.. దారి తప్పేశారు.
ఆయనే హైదరాబాద్‌లోని అంబర్ పేట సబ్ ఇన్స్‌పెక్టర్ భాను ప్రకాష్. జల్సాలకు అలవాటు పడిన భాను ప్రకాష్ పై డిపార్ట్‌మెంటులో అనేక మరకలు, మచ్చలు పడ్డాయి. అడ్డదారిలో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలని భావించిన ఆయన.. ఏకంగా తన వృత్తినే దీనికి దొడ్డిదారిని చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగులు, జల్సాలకు అలవాటైన ఎస్సై భాను ప్రకాష్ నిర్వాకం.. ఇప్పుడు తెలంగాణ పోలీసు వ్యవస్థను కుదిపేస్తోంది. దీనికి కారణం.. ఏకంగా సర్వీసు రివాల్వర్‌ను అమ్మేయడమేనని పోలీసులు చెబుతున్నారు.
క్రికెట్ బెట్టింగులే కాదు.. అసలు ఎలాంటి ఆర్థిక నేరాలనైనా పోలీసులు కట్టడి చేయాలి. వీటిని ప్రోత్సహించే వారిని అదుపులోకి తీసుకోవాలి. అవగాహన కూడా కల్పించాలి. కానీ, అంబర్ పేట ఎస్సై భాను ప్రకాష్.. తానే ఈ బెట్టింగులకు పాల్పడుతున్నట్టు అధికారులు తాజాగా తెలుసుకున్నారు. అంతేకాదు.. ఈక్రమం లో బెట్టింగుల కోసం.. సొమ్మును సంపాయించుకునేందుకు తన సర్వీసు రివాల్వర్‌ను విక్రయించేసినట్టు తెలుసుకుని హతాశులయ్యారు.
ఏం జరిగింది?
ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అంబర్ పేట డివిజన్ డీఎస్పీ తన పరిధిలోని స్టేషన్లను తనిఖీ చేశారు. అయితే.. అంబర్ పేట స్టేషన్ ఎస్సై భాను ప్రకాష్‌ను విచారించినప్పుడు.. అతని వద్ద ఉండాల్సిన సర్వీసు తుపాకీ కనిపించలేదు. దీంతో అధికారులు ఆరా తీయగా.. విక్రయించినట్టు తెలిసింది. ఆ సొమ్మును కూడా క్రికెట్‌బెట్టింగులకు వినియోగించారు. అయితే.. ఎవరికి అమ్మారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
అంతేకాదు.. ఇటీవల ఇదే స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం కేసులో కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. దానిని కూడా అమ్మేసి క్రికెట్ బెట్టింగులకు వినియోగించినట్టు తెలుసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. నేరం రుజువైతే ఉద్యోగానికే ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.