`తెలంగాణ జాగృతి` అధ్యక్షురాలు.. మాజీ ఎంపీ కవిత అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు మంచివేనని.. కానీ, హద్దు మీరి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “నేను ఒక్కరి నేనన్న భావన మీకు ఉండొచ్చు. కానీ, నా యాత్రలకు వస్తున్న జనాలను చూడండి. ఈ తెలంగాణ సమాజాన్నిచూడండి.“ అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజాగా నల్గొండ జిల్లాలో నిర్వహించి తెలంగాణ జన జాగృతి యాత్రలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భం గా స్థానిక ఆసుపత్రులను పరిశీలించారు. ఏమాత్రం సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడ పనిచేసేందుకు సిబ్బంది ఉన్నారని, వైద్యానికి వస్తున్న రోగుల సంఖ్య కూడా బాగానే ఉందని.. కానీ వారికి సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రం లేకుండా పోయాయని విమర్శించారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ ఎస్‌ను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రతిపక్షం లేదని కవిత అన్నారు. ఉన్న నాయకులు కూడా అధికార పార్టీ నేతలతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. దీంతో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు తాను రంగంలోకి దిగానని చెప్పారు. అయితే.. తనను వ్యక్తిగ తంగా విమర్శలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇలాంటి విమర్శలకు.. తాను తలొంచనని.. ఫలితం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక, తమ జాగృతి సంస్థ ప్రతినిధులు తమ యాత్రకుసంబంధించి కట్టిన ఫ్లెక్సీలను కొందరు చింపేశారని .. కవిత ఆరోపించారు. ఇదంతా తమ హవాను తట్టుకోలేకేనని కవిత వ్యాఖ్యానించారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న ఆమె.. తమ పోరాటం ప్రభుత్వంపైనేనని ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా ఉండదని వ్యాఖ్యానించారు.