hyderabadupdates.com movies జూబ్లీ పోరు: ‘మాస్’ ఓటింగ్ ద‌శ మార్చేస్తుందా?

జూబ్లీ పోరు: ‘మాస్’ ఓటింగ్ ద‌శ మార్చేస్తుందా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో సుమారు 4 ల‌క్ష‌ల మందికిపైగా ఓట‌ర్లు త‌మ హ‌క్కును వినియోగించుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఇది పోలింగ్ జ‌రిగే రోజును బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. ఆదివారం నాడు పోలింగ్ జ‌రిగితే.. ఎక్కువ శాతంలో ఓటు ప‌డే అవ‌కాశం ఉంది. గ‌తంలో జ‌రిగిన ప‌లు పోలింగ్ ల‌ను గ‌మ‌నిస్తే.. ఇది స్ప‌ష్టంగా తెలుస్తుంది. కానీ.. ప‌నిదినాల్లో ఎప్పుడు పోలింగ్ జ‌రిగినా.. ఓటింగ్ శాతంపై ప్ర‌భావం క‌నిపిస్తోంది.

ఈ సారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగ‌ళ‌వారం వ‌చ్చింది. దీంతో ఉద్యోగులు, వ్యాపార సంస్థ‌లలో ప‌నిచేసే వారు.. విధులకు వెళ్లిపోతారు. స‌హ‌జంగా ఎన్నిక‌ల రోజు.. సెల‌వు ఉంటుంది. కానీ, ఇది ఉప ఎన్నిక కావ‌డంతో సెల‌వు ప్ర‌క‌ట‌న‌పై ఇంకా క్లారిటీ లేదు. పైగా జూబ్లీహిల్స్‌లో ఉద్యోగులు, వ్యాపారులు.. ఎక్కువ‌గా ఉన్నార‌న్న అంచ‌నా ఉంది. దీంతో వారు ఏమేరకు పోలింగ్ లో పాల్గొని ఓటేస్తార‌న్న ప్ర‌శ్న‌గానే మారింది. పైగా ఉప ఎన్నిక అన‌గానే ఓట‌ర్లు లైట్ తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

దీంతో మాస్ ఓటింగ్‌పైనే పార్టీలు ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నాయి. మాస్ అయితే.. సెల‌వుల‌తో సంబంధం లేకుండా.. త‌మ `అభిమాన` పార్టీకి ఓటేసేందుకు ముందుకు వ‌స్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌లోనూ కీల‌క పార్టీలైన బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు మాస్ ఓటింగ్ కేంద్రంగా చివ‌రి రోజు ఆదివారం పావులు క‌దుపుతున్నాయి. వారిని ఆక‌ట్టుకునేందుకు `తాయిలాలు` ఇస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మాంసాహారుల‌కు ఇంటికి కిలో చికెన్‌, మ‌ట‌న్ అందిస్తున్నార‌ని ఒక‌పార్టీపై మ‌రో పార్టీ అంత‌ర్గ‌తంగా ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా బోర‌బండ‌, ర‌హ్మ‌త్ న‌గ‌ర్ వంటి బ‌స్తీల్లో .. పేద‌లు, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఎక్కువ‌గా ఉన్ననేప‌థ్యంలో వారిని టార్గెట్ చేసుకుని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇన్నాళ్లు చేసిన ప్ర‌చారానికి చివ‌రి ఒక్క‌ రోజు ప్ర‌చారానికి తేడా ఉండ‌డంతో నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. కేంద్ర మంత్రుల నుంచి మాజీ మంత్రుల వ‌ర‌కు, కాంగ్రెస్ త‌ర‌ఫున జాతీయ‌స్థాయి నాయ‌కుల నుంచి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు రంగంలోకి దిగ‌డం వెనుక ఇదే కార‌ణ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Related Post