hyderabadupdates.com movies టికెట్ రేట్ల విషయంలో ఎవరు కరెక్ట్

టికెట్ రేట్ల విషయంలో ఎవరు కరెక్ట్

అఖండ 2 విడుదల దగ్గర పడుతున్న టైంలో టికెట్ రేట్ల పెంపు చర్చ మరోసారి తెరమీదకు వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిర్మాతలకు ఎదురవుతున్న ప్రశ్న ఇదే. ఎంత హైక్ తీసుకోబోతున్నారని. భయపడేలా వెయ్యి రూపాయలు ఆపైన పెట్టమని, భరించేలానే ఉంటాయని క్లారిటీ ఇవ్వడంతో పాటు, పండగ సమయాల్లో బస్ చార్జీలు పెంచినప్పుడు ప్రశ్నించని వాళ్ళు ఇప్పుడు కేవలం టికెట్ రేట్ల గురించే సమస్య వచ్చిందనే తరహాలో మాట్లాడ్డం సబబుగా లేదని అన్నారు. ఏడాదికి పది పదిహేను సినిమాలకే హైక్స్ ఉంటాయి తప్పించి మిగిలినవన్నీ సాధారణ ధరలతోనే రిలీజ్ అవుతున్నాయని చెప్పారు.

టికెట్ రేట్లు పెంచడం వల్లే థియేటర్లకు రాలేకపోతున్నామనేది సాధారణ ప్రేక్షకులు కొంత మంది నుంచి వస్తున్న కంప్లయింట్. ఇక్కడ కొన్ని కోణాలు విశ్లేషించుకోవాలి. సినిమా అనేది నిత్యావసరం కాదు. చూడకపోతే ఏమి కాదు. కానీ చూడకుండా ఉండలేనంత ప్రేమ, అభిమానం తెలుగు ఆడియన్స్ సొంతం. అందుకే ఉదయం చూస్తే సగం రేట్ తగ్గుతుందని తెలిసినా ప్రీమియర్ కోసం రెట్టింపు సొమ్ములు ఖర్చు పెట్టే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇది ఒకరకంగా తీయని బలహీనత. దాన్ని వీలైనంత క్యాష్ చేసుకోకూడదనేది నిర్మాతలు ఆలోచించాలి. వందలాది కోట్ల బడ్జెట్ తో తీసినప్పుడు అడగడంలో తప్పేమీ లేదు.

కానీ కొందరు టయర్ 2 హీరోల సినిమాలకు రీజనబుల్ బడ్జెట్ లో అయినవాటికి కూడా పెంపులు తీసుకోవడం సబబు కాదనే కామెంట్ లో నిజం లేకపోలేదు. గేమ్ ఛేంజర్ సినిమా బాలేకపోయినా హైక్స్ ఉన్నందు వల్లే కనీసం ఒకసారి చూద్దామనుకున్న మూవీ లవర్స్ ఆగిపోయారు. తండేల్, హిట్ 3 లాంటివి సక్సెస్ ఫుల్ సినిమాలు తమ పొటెన్షియాలిటీని వాడుకోలేకపోయాయి. ఎవరి కోణంలో వాళ్లు కరెక్ట్ గానే అనిపిస్తున్నా ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే. రాజు వెడ్స్ రాంబాయి విజయం వెనుక మొదటి రోజు 99 రూపాయల టికెట్ కారణమంటే కాదనేవారు ఎవరు. ఓజి వేగంగా లాభాల్లోకి వెళ్ళడానికి కారణం కూడా పెరిగిన రేట్లే. మరి రెండు రైటే అయినప్పుడు రాంగ్ ఎక్కడుందందనేది అంతు చిక్కని ప్రశ్న.

Related Post