సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సక్సెస్ స్టోరీలు కొన్ని చాలా ఇన్స్ పిరేషన్ గా ఉంటాయి. 1992 చిరంజీవి ఆజ్ కా గూండారాజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడిగా కనిపించి కన్పించకుండా చిన్న వేషం వేసిన రవితేజ కొన్నేళ్ల తర్వాత ఇంద్రతో పోటీపడే ఇడియట్ గా వస్తాడని ఎవరైనా ఊహించారా. తన అభిమాన నటుడితోనే అన్నయ్య, వాల్తేర్ వీరయ్య చేస్తాడని గెస్ చేసి ఉండటం సాధ్యమా. ఇలాంటివి బోలెడు. కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తో రికార్డులు సృష్టిస్తున్న రిషబ్ శెట్టికు కూడా అలాంటి కథే ఒకటుంది. ఇప్పుడంటే కాంతారతో పేరు తెచ్చుకున్నాడు రిషబ్ మెగా ఫోన్ చేపట్టింది 2016లో వచ్చిన రిక్కీ అనే మూవీతో.
హీరో తను కాదు. రక్షిత్ శెట్టిని పెట్టి పోలీస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీశాడు. కానీ రిలీజ్ టైంలో చాలా కష్టాలు పడ్డాడు. టాక్ పాజిటివ్ గా వచ్చినప్పటికీ తగినన్ని షోలు లేక ఆడియన్స్ ని మూవీ రీచ్ కావడం లేదని భావించి పలు మార్గాల్లో స్క్రీన్ల కోసం తపించిపోయాడు. ఆఖరికి ఒక బెంగళూరు మల్టీప్లెక్స్ లో సాయంత్రం షో ఒకటి ఇస్తే అదేదో పెద్ద అవార్డు వచ్చినంత సంబరంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కట్ చేస్తే 2025లో కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ అయిదు వేలకు పైగా థియేటర్లలో ఆడుతున్నా హౌస్ ఫుల్స్ తో షోలు కాదు టికెట్లు దొరకని స్టేజికి వచ్చాడు. ఇది కదా నిజమైన కిక్ అంటే.
అప్పట్లో పెట్టిన ట్వీట్ ని గుర్తు చేస్తూ రిషబ్ శెట్టి ఇదంతా చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా కాంతారనే అతని టాలెంట్ కి కొలమానం కాదు. కిరిక్ పార్టీ అనే యూత్ ఫుల్ డ్రామాతో శాండల్ వుడ్ రికార్డులు బద్దలు కొట్టడంతోనే తన జర్నీ మొదలయ్యింది. సహిప్రా సాలే కాసరగోడుతో జాతీయ అవార్డు కూడా సాధించాడు. అటుపై కాంతార అవకాశం వచ్చింది. సాంకేతికంగా అన్ని విభాగాల మీద బలమైన పట్టున్న రిషబ్ శెట్టి మరోసారి తన సత్తా చాటాడు. ఇంకా రెండు రోజులే అయ్యింది కాబట్టి బాక్సాఫీస్ స్టేటస్ గురించి అప్పుడే చెప్పలేం కానీ మౌత్ టాక్ బలంగా ఉన్న నేపథ్యంలో బ్లాక్ బస్టర్ ఖాయమనేలా కలెక్షన్లు వస్తున్నాయి.