బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర చేసిన అన్ను కపూర్ ను మర్చిపోలేరు. ఇంకా మరెన్నో పాత్రలతో ఆకట్టుకున్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది తమన్నా గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ‘స్త్రీ-2′ సినిమాలో తమన్నా చేసిన ఐటెం సాంగ్’ఆజ్ కీ రాత్’ గురించి అన్ను కపూర్ మాట్లాడారు. తమన్నా అందాన్ని ఉద్దేశించి ‘దూదియా బదన్’ (పాల లాంటి శరీరం) అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఓ సీనియర్ నటుడు అయి ఉండి.. కూతురి వయసున్న నటి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్లు అప్పట్లో ఆయనపై విరుచుకుపడ్డారు. అప్పుడు మౌనం వహించిన అన్ను.. తన వ్యాఖ్యలపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.
తాను తమన్నాకు కాంప్లిమెంట్ ఇచ్చానే తప్ప.. తన వ్యాఖ్యల్లో కామం ఏమి లేదని అన్ను స్పష్టం చేశారు. తమన్నా బాధపడి ఉంటే కాళ్లు పట్టుకోడానికైనా సిద్ధమే అని ఆయన చెప్పారు. తాను అన్న మాటల్లో ఎలాంటి అశ్లీలత లేదని.. కేవలం తన మాటల్ని హిందీలో చెప్పడం వల్లే రచ్చ జరిగిందని ఆయన అన్నారు.
“నా మాటల వల్ల కొందరు నన్ను తిట్టారు. అదే విషయాన్ని ఇంగ్లీషులో ‘మిల్కీ బాడీ’ అని ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ హిందీలో అన్నందుకే అందరికీ సమస్యగా మారింది. మన భాషలో అంటే అది బూతులా కనిపిస్తుందా? నేను ఆమె శరీరాకృతిని చూసి అభినందించాను తప్ప.. నా మనసులో ఎలాంటి కామం లేదు. రోల్స్ రాయిస్ కారును చూసి బాగుందని మెచ్చుకుంటాం.. అంత మాత్రాన ఆ కారు మనకే కావాలని కోరుకోం కదా. ఇదీ అంతే” అని అన్ను కపూర్ అన్నారు.
తమన్నా వయసు 30 ఏళ్ల లోపే ఉండొచ్చని.. తన పిల్లలు కూడా అదే వయసులో ఉన్నారని.. ఒక తండ్రిలాగే తాను ఆమెను అభినందించానని ఆయనన్నారు. ఒకరి అందాన్ని మెచ్చుకోవడమంటే వారిపై వ్యామోహం ఉన్నట్టు కాదని.. తన ఉద్దేశం తప్పు కానప్పుడు భయపడాల్సిన పని లేదని అన్ను కపూర్ చెప్పారు.