తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఓ మహిళ.. ఏకంగా 7.3 అడుగుల హైట్ ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏడు అడుగుల పైన హైట్ ఉన్న ఈమె.. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి. పేరు తర్జిని శివలింగం. నెట్ బాల్ క్రీడలో శ్రీలంకకు అనేక పతకాలు కూడా తీసుకువచ్చారట. ప్రస్తుతం ఆ క్రీడ నుంచి రిటైరై.. ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈమె అనూహ్యంగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
శ్రీవారి పరమ భక్తుడైన వానమామలై వరదాచార్యుల పేరుతో వానమామలై పీఠం ఏర్పాటైంది. దీనిని ఆయన వంశీకులు నడిపిస్తున్నారు. దీనికి శ్రీలంకలోనూ.. మఠం ఉంది. ఈ మఠం తరఫున.. తర్జిని శివలింగం.. తిరుమలలో పర్యటించారు. మఠాధి పతులు, మరికొందరు భక్తులతో కలిసి.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిత్రం ఏంటంటే.. ఆమె కన్నా.. ఎక్కువ హైట్ ఎవరూ లేకపోవడం.. ఎత్తయిన గుమ్మాలు, మండపాలను కూడా తలవంచుకుని దాటి వెళ్తున్న వైనం.. వంటివి భక్తులను అమితంగా ఆకర్షించాయి. తర్జిని శివలింగానికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు జోరుగా వైరల్ అవుతుండడంతో వీటికి నెటిజన్ల నుంచి కూడా భారీ లైకులు పడుతున్నాయి. ఈమె.. ఏడడుగుల ఉమెన్ బుల్లెట్! అంటూ కామెంట్లు కురుస్తున్నాయి.