తెలంగాణలో తాజాగా `సికింద్రాబాద్` కేంద్రంగా వివాదం తెరమీదకి వచ్చింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రస్తుతం ఉన్న మండలాల పరిధిలను కూడా మార్చనున్నారు. అయితే.. దీనికి కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కీలకమైన జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లోని ఉత్తర భాగం(నార్త్‌జోన్)లో ఉన్న కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కార్పొరేషన్లో కలిపేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారం తెరమీదికి వచ్చింది.
వాస్తవానికి దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ, కొన్ని రోజుల కిందట మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్.. మాట్లాడుతూ.. సికింద్రబాద్ అస్తిత్వానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. సికింద్రాబాద్ పేరును కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక్కడి నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు అయితే.. ఈ ఆరోపణలపైనా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో బీఆర్ ఎస్ చేసిన ఆరోపణలు నిజమనే పరిస్థితి వచ్చింది.
సికింద్రాబాద్‌లో నార్త్ జోన్ ప్రాంతాలుగా.. ప్రస్తుతం మల్కాజిగిరిలోని కొన్ని ప్రాంతాలు, కుత్బుల్లాపూర్ పూర్తిగా, అల్వాల్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు కూడా ఉన్నాయి. పైగా.. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలుగా కూడా వీటిని గుర్తించారు.
ఇప్పుడు ఈ ప్రాంతాలను అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా సికింద్రాబాద్‌ను విడదీసి.. మల్కాజిగిరిలో కలపనున్నారన్నది ప్రధాన వివాదం. అయితే.. సికింద్రాబాద్‌కు ఈ ప్రాంతాలే కీలకం కావడం.. ప్రజలు కూడా ఇవి.. సికింద్రాబాద్‌లోనే ఉండాలని కోరుతున్న నేపథ్యంలో వివాదం పెరిగింది.
కానీ, సర్కారు నుంచి మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. విడదీస్తున్నామని కానీ.. లేదు.. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని కానీ.. చెప్పలేదు. ఇక, ఓటు బ్యాంకు పరంగా కూడా ఇది బీఆర్ ఎస్ కు కంచుకోట అనే చెప్పాలి. మరోవైపు.. జంట నగరాల్లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్ పరిధిలోనే రైల్వే స్టేషన్, అతి పెద్ద బస్టాండు కూడా ఉన్నాయి.