100 బండ్లు దొంగతనం చేశా…నా మీద కేసులున్నాయి…ఏం చేసుకుంటారో చేసుకోండి….అంటూ పోలీసులకు ఓ బైక్ దొంగ సవాల్ విసిరాడు. తన మిత్రులతో పందెం కాసి మరీ దమ్ముంటే పట్టుకోరా షెకావత్….పట్టుకుంటే వదిలేస్తా బైక్ దొంగతనాలు.. అంటూ ఏకంగా ఓ వీడియో చేశాడు. అయితే, ఇది సినిమా కాదు…కాబట్టి పోలీసులు ఆ వీడియోను చూసి ఆ దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ అని లోకేశ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ బైక్ దొంగను ఏలూరు పోలీసులు పట్టుకొని నడిరోడ్డు మీద నడిపిస్తూ తీసుకువెళ్తున్న వైనం వైరల్ అయింది. దొంగతనం చేశా అని ఎవిడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి మరీ ఏలూరు పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఆ దొంగను రోడ్డుపై నడిపించుకుంటూ వెళుతున్న వీడియోను ఏలూరు పోలీసులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిని లోకేశ్ షేర్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సంగతి తెలిసిందే. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారితో గుంజీలు తీయించారు పోలీసులు. ఇక, పొలాల్లో ప్రశాంతంగా పేకాడుతున్నాం.. మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకున్న పేకాట రాయుళ్లను కూడా పోలీస్ డ్రోన్లు పరిగెత్తించాయి. ఇలా, చంద్రబాబు హయాంలో లోకేశ్ పర్యవేక్షణలో ఏపీలో దొంగలు హడలెత్తిపోతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
AP Police on Duty https://t.co/PYC2sOyKZ3— Lokesh Nara (@naralokesh) November 8, 2025