ధనుష్ సినీ రంగంలోకి రావడానికి ముందే అతడి తండ్రి తమిళ పరిశ్రమలో చిన్న స్థాయి దర్శకుడు. అలా అని దాని వల్లేమీ కోలీవుడ్ అతడికి రెడ్ కార్పెట్ పరచలేదు. తొలి చిత్రం ‘తుళ్ళువదో ఎలమై’లో అతడి పాత్ర, లుక్స్ చూసి ఇతనేం హీరో అనే అన్నారు. ఆ సినిమాను అనేక కష్టాలు పడి ధనుష్ ఫ్యామిలీనే పూర్తి చేసింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయినా ధనుష్‌కు పెద్దగా పేరు రాలేదు.
కానీ తన అన్న సెల్వ రాఘవన్‌తో చేసిన ‘కాదల్ కొండేన్’ బ్లాక్ బస్టర్ కావడమే కాక.. నటుడిగా కూడా అతడికి గొప్ప పేరు రావడంతో కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత అనేక అద్భుతమైన సినిమాలు, పాత్రలతో ధనుష్ దేశంలోనే గొప్ప నటుల్లో ఒకడిగా పేరు సంపాదించాడు. ఇప్పుడతను సినిమాకు రూ.40-50 కోట్ల మధ్య పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగాడు. నటుడిగానే కాక దర్శకుడిగానూ అతను విజయాలు అందుకుంటున్నాడు.
మిడిల్ క్లాస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ధనుష్ ఇప్పుడు ఏడాది వ్యవధిలో అత్యధిక ఆదాయం పొందే నటుల్లో ఒకడిగా ఎదిగాడు. చిన్నప్పుడు తన తల్లి వంద రూపాయల వాచీ కొని ఇచ్చినపుడు కలిగిన ఆనందం గురించి అతను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. తనకు వాచీలంటే పిచ్చి అని.. తల్లి కొనిచ్చిన ఆ వాచీని ఇప్పటికీ దాచి పెట్టుకున్నానని ధనుష్ వెల్లడించాడు. తాను స్టార్‌గా ఎదిగాక కోట్ల రూపాయలు పెట్టి వాచీలు కొనుక్కోవడం అలవాటుగా మారిందట.
తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో పెట్టుకున్న వాచీ ఖరీదు రూ.2.5 కోట్లని అతను వెల్లడించాడు. ఎప్పట్నుంచో ఇలా లగ్జరీ వాచీలను సేకరించడం అలవాటుగా మారిందని అతను తెలిపాడు. ఇప్పుడు ధనుష్ దగ్గర ఉన్న వాచీల విలువ మాత్రమే రూ.60 కోట్ల దాకా ఉండొచ్చని తన సన్నిహితుల సమాచారం. మరి సినిమాకు రూ.50 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నపుడు రెండున్నర కోట్ల రూాపాయల వాచీ కట్టుకోవడం.. వాచీల కలెక్షన్ రూ.60 కోట్ల దాకా ఉండడం పెద్ద విషయం కాదు. ఇదంతా ధనుష్ కేవలం తన కష్టంతో సంపాదించుకున్నదే కాబట్టి ఈ లగ్జరీలను ఎంజాయ్ చేయడానికి అతను అర్హుడు.