నదుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. నదుల అనుసంధానం ఆగేది లేదన్నారు. వాస్తవానికి కొన్నాళ్ల కిందట బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తలపోశారు. అయితే.. దీనికి తెలంగాణ నుంచిపెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. “చంద్రబాబు వేరే రూపంలో బనకచర్ల చేపడుతున్నారు” అని తెలంగాణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నదుల అనుసంధానంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాజాగా కడప జిల్లా కమలాపురంలో పర్యటించిన చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విడతలో రైతులకు రూ.5000 చొప్పున రాష్ట్రం, రూ.2000 చొప్పున పీఎం-కిసాన్ కింద కేంద్రం ఇస్తున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించి.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ఆగబోదని తేల్చి చెప్పారు.
రాయల సీమలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. రాష్ట్రంలో సాగు విధానంలో మార్పు లు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రతి విషయంలోనూ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని.. రైతులు మాత్రమే టెక్నాలజీకి దూరంగా ఉంటున్నారని.. ఇకపై అలా ఉండబోదన్నారు. రైతులు కూడా టెక్నాలజీని అందుకునేలా విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంలో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా నేచర్ పామింగ్(ప్రకృతి సేద్యం) చాలా ముఖ్యమని సీఎం వివరించారు.
రైతులు అభివృద్ధి కోసం..ఐదు కీలక సూత్రాలను తీసుకువచ్చామన్నారు. వాటిని అమలు చేస్తే.. అన్నదాతల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజులను సీఎం గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వ్యవసాయం చేసుకునేవారని.. తాను కూడా సాగులో ఆయనకు సాయం చేసేవాడినని చెప్పారు. అధునాతన విధానాలను అందిపుచ్చుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని.. సాగులో అనేక పద్ధతులు మారుతున్నాయని.. వాటిని అందిపుచ్చుకుని రైతుల ఆదాయం పెరిగేలా చూస్తామన్నారు.