ప్రస్తుతం తలెత్తిన తుఫాను నష్టాన్ని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రాథమికంగా 5625 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ఇక పూర్తిస్థాయిలో నష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచనా వేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువచ్చి రాష్ట్రంలో తుఫాను ప్రభావిత బాధితులకు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా లేఖలు రాసినా ఆయనే స్వయంగా ఢిల్లీకి వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కష్టం వచ్చింది. దోబూచులాడుతూ దూసుకువచ్చిన మొంథా తుఫాను కారణంగా 450 మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం 900 కోట్ల రూపాయలకు పైగా రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.
మరో 3000 కోట్లు రహదారుల పునరుద్ధరణకు, మరో 350 కోట్ల రూపాయలు ఇళ్లు కోల్పోయిన తీర ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు తేల్చారు. అలాగే 1000 కోట్ల రూపాయలను తాగునీటి సరఫరా, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ వంటి పనులకు వెచ్చించాలని చెబుతున్నారు.
ఇలా ప్రతి దానికీ లెక్క వేశారు. ఈ క్రమంలో కేంద్రంలోని సర్కారు సాయం తప్పకుండా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
వాస్తవానికి గత ఏడాది సెప్టెంబరులో విజయవాడ సహా ఏలూరులో సంభవించిన వర్షాలకు కూడా 6500 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కారు కేంద్రానికి నివేదిక పంపించింది.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు లేఖ రాయడంతోపాటు తనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి నష్టం వివరాలు తెలపాలని భావిస్తున్నారు.
ఎలానూ సీఎం చంద్రబాబు వచ్చే వారం బీహార్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.
ఇక దీనికి ముందే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, అదేవిధంగా కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అమిత్‌షాతోనూ భేటీ అయి నష్టానికి సంబంధించిన పరిహారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయనున్నారు.