టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన మరో శిఖరాన్ని అందుకున్నారు. వాస్తవానికి దేశంలో 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఒకరిద్దరు ఉన్నా.. చంద్రబాబు ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వ్యక్తి.. అందునా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ తరఫున 15సంవత్సరాల పాటు ఆయన ముఖ్య మంత్రిగా పనిచేయడం రికార్డేనని అంటున్నారు విశ్లేషకులు.
ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ తరఫున 15 ఏళ్ల పాటు తెలుగు ప్రజలను పాలించిన నాయకుడిగా చంద్రబాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఇది కేవలం సంఖ్యాపరంగానో.. సంవత్సరాల పరంగానో లెక్కించి ఇచ్చే రికార్డు కావొచ్చు. కానీ.. వ్యక్తిగతంగా చూసుకుంటే.. చంద్రబాబు పాలనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉంటున్నాయి కూడా!. ఆయన ఆది నుంచి కూడా సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రభుత్వం మాత్రమే అన్ని పనులు చేయలేదన్న.. చైనా(కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం) అనుసరించే విధానం మనకు అప్రకటితంగా చంద్రబాబు పాలనలో కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ పాలనలో భాగస్వామ్యం చేసే జపాన్ సంస్కృతి కూడా ఆయన ప్రభుత్వంలో కనిపిస్తుంది. అది పథకాల రూపంలో కావొచ్చు.. లేదా విధాన పరమైన నిర్ణయం కావొచ్చు. చంద్రబాబు స్టయిల్ వేరేగా ఉంటుంది. జన్మభూమి, పీ-4వంటివి ఈ పథకాలకు మచ్చుతునకలు.
అదేసమయంలో కేంద్రంలోనూ చక్రం తిప్పిన నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఒక్క 2018-19 మధ్య ఏడాది కాలాన్ని పక్కన పెడితే.. మిగిలిన 14 సంవత్సరాల్లోనూ ఆయన కేంద్రంలో చక్రం తిప్పారు. పెద్దనోట్ల రద్దు దరిమిలా.. డిజిటల్ మనీని ప్రోత్సహించేందుకు కేంద్రం నియమించిన కమిటీకి సారథ్యం వహించారు చంద్రబాబు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు.. జాతీయ రహదారులపై అధ్యయన కమిటీ వేసినప్పుడు.. ఆ కమిటీలో బాబు లేకపోయినా.. సలహాలు, సూచనలను అందించారు. ఇలా.. ఆయన ప్రస్థానంలో అనేక మలుపులు, మెరుపులు ఉన్నాయనడంలో సందేహం లేదు.