hyderabadupdates.com movies నితిన్‌కు కథ చెబితే… సిద్ధు పేరు చెప్పాడు

నితిన్‌కు కథ చెబితే… సిద్ధు పేరు చెప్పాడు

ప్రపంచవ్యాప్తంగా ఏ సినీ పరిశ్రమను తీసుకున్నా లేడీ డైరెక్టర్లు తక్కువగానే కనిపిస్తారు. తెలుగులో మహిళా దర్శకులు మరింత తక్కువ. అందులో సక్సెస్ అయిన వాళ్లు మరింత అరుదుగా కనిపిస్తారు. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలోకి చేరాలనే చూస్తోంది నీరజ కోన. తన ఇంటి పేరు చెబితే అందరికీ కోన వెంకటే గుర్తుకు వస్తారు. ఈ స్టార్ రైటర్ సోదరి అయిన నీరజ.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అలా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న అనుభవం, అన్న నుంచి అందిపుచ్చుకున్న రైటింగ్ టాలెంట్.. దర్శకత్వం వైపు అడుగులు వేసేలా చేశాయి.

చాలా ఏళ్ల ప్రయత్నాల తర్వాత ఆమె ‘తెలుసు కదా’ మూవీతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 17న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాను దర్శకురాలు కావడం వెనుక కథను ఆమె మీడియాతో పంచుకుంది.

కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న సమయంలో అన్ని విభాగాల మీదా తాను అవగాహన పెంచుకున్నానని.. మరోవైపు చిన్నతనం నుంచి రచన మీద ఉన్న ఆసక్తితో షార్ట్ స్టోరీస్ రాసేదాన్నని.. ఇండస్ట్రీలో చాలా ఏళ్లు పని చేశాక తనకు దర్శకురాలు కావాలన్న కోరిక బలపడిందని ఆమె వెల్లడించింది. తాను ఏ కథ రాసినా తనకు సన్నిహితులైన నాని, నితిన్‌లకు చెప్పేదాన్నని.. వాళ్లే తాను దర్శకురాలు అయ్యేలా ప్రోత్సహించారని ఆమె వెల్లడించింది.

ఆ తర్వాత ‘తెలుసు కదా’ కథ రాసి నితిన్‌కు వినిపిస్తే.. ఈ స్టోరీ సిద్ధు జొన్నలగడ్డకు కరెక్టుగా సూటవుతుందని అతనే సజెస్ట్ చేశాడని… సిద్ధుకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కిందని ఆమె తెలిపింది. సిద్ధు లేకుంటే ఈ సినిమా రూపొందేదే కాదని.. నిర్మాత విశ్వప్రసాద్ కూడా తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. తన విజన్‌కు తగ్గట్లుగా సినిమా రూపొందేందుకు కారణమయ్యారని నీరజ కోన చెప్పింది.

Related Post