hyderabadupdates.com movies `నో కింగ్స్‌`: క‌దం తొక్కిన అమెరికా.. ట్రంప్‌కు సెగ‌!

`నో కింగ్స్‌`: క‌దం తొక్కిన అమెరికా.. ట్రంప్‌కు సెగ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల‌ను.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌డుతు అమెరిక‌న్లు రోడ్డెక్కారు. నిజానికి ట్రంప్ అధ్య‌క్ష‌పీఠం ఈ రోజు(అక్టోబ‌రు 20) ఎక్కి కేవ‌లం 10 మాసాలే అయింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 20న ఆయ‌న అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎంతో ఒద్దిక‌తో అమెరిక‌న్లు గ‌త ఏడాది జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఆయ‌న వ‌స్తే.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌హా విదేశీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని ఆశించారు. అదేస‌మ‌యంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్టడి చేస్తార‌ని కూడా అనుకున్నారు. అయితే.. వారి ఆశ‌లు ఒక్క‌టీ నెర‌వేర‌లేదు.

పైగా.. ట్రంప్ దుందుడు నిర్ణ‌యాల ఫ‌లితంగా ప్ర‌పంచ దేశాల నుంచి అగ్ర‌రాజ్యం తొలిసారి వ్య‌తిరేక‌త చూస్తోంది. అంతేకాదు.. వివిధ దేశాల‌పై విధించి టారిఫ్‌ల ప్ర‌భావంతో అమెరికా ప్ర‌జ‌ల చేతి చ‌మురు వ‌దిలిపోతోంది. సంపాద‌న‌కు.. ఖ‌ర్చుకు పొంత‌న లేకుండా పోయింది. ఈ ప‌రిణామాల‌తోపాటు.. రాజ‌కీయంగా కూడా ట్రంప్‌కు మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయి. అదే స‌మయంలో విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇచ్చే నిధుల‌ను ఆపేయ‌డం, వీసా నిబంధ‌న‌లు క‌ఠినత‌రం చేయ‌డంతో అగ్ర‌రాజ్యం ఆదాయం కూడా ప‌డిపోయింది. అంతేకాదు.. సొంత విధానాల‌ను తీసుకువ‌చ్చి.. రాజ్యాంగాన్నే మార్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్న తీరును ట్రంప్ స‌న్నిహితులు కూడా మెచ్చుకోలేక పోతున్నారు.

ఇదిలావుంటే..తాను ఏం చేసినా.. అమెరిక‌న్ల కోస‌మేన‌ని చెబుతున్న ట్రంప్ ప‌రివారం.. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదాన్ని వినిపిస్తోంది. కానీ.. గ్రేట్‌కాదు.. మా బ‌తుకులు గేట్‌కు వేలాడుతున్నాయ‌ని.. అమెరికా ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌న్న స్పృహ‌ను కూడా మ‌రిచిపోతున్నార‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యానిస్తూ.. `నో కింగ్స్‌` పేరుతో పెద్ద ఎత్తున శ‌నివారం, ఆదివారం ఉద్య‌మించారు. అమెరికాలోని ఇతర దేశాల ఎంబసీల దగ్గర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ నిర‌స‌న‌లు ఉవ్వెత్తున సాగాయి. నిర‌స‌న‌కారుల‌తో ప్ర‌ధాన న‌గ‌రాలు నిండిపోయి.. ఇస‌కేస్తే రాల‌నంత‌గా మారాయి.

ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీలను వ్యతిరేకిస్తూ అమెరికన్స్ దేశంలోని చాలా నగరాల్లో మిలియన్ మార్చ్ తో రోడ్డెక్కారు. లక్షలాది మంది ఓకే చోట చేరి నిరసన గళం వినిపించారు. ఈ `ప్రొటెస్ట్ మార్చ్` క్రమేపీ వైల్డ్ ఫైర్ లా దేశం అంతా వ్యాపించింది. ఎడ్యుకేషన్, నిరుద్యోగం, ఇమిగ్రేషన్, సెక్యూరిటీ పాలసీల పై `నో కింగ్స్‌` పేరిట దేశ‌వ్యాప్త నిర‌స‌న చేపట్టారు. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్, మిస్సిసిపీ, ఫిల‌డెల్ఫియా తదితర చాలా ప్రధాన నగరాలతో పాటు… ఇతర దేశాల్లోని ఎంబసీల వద్ద నిరసనలతో హోరెత్తించారు. ట్రంప్ ఇతర దేశాల కంటే ముందు స్వదేశంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని నిర‌స‌న కారులు డిమాండ్ చేశారు. అయితే.. ఈ నిర‌స‌న‌ల‌ను ట్రంప్ వ‌ర్గం వ్యంగ్యంగా అభివ‌ర్ణించింది.

Related Post