ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఆయన వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రెండు తెలుగు ప్రజల రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. శారీరకంగా మానసికంగా కలిసే ఉన్నాయని.. ఎలాంటి శతృత్వం లేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఆయన తన కుమార్తెను భీమవరం అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని నారాయణ గుర్తు చేశారు. కాబట్టి.. శతృత్వాలు లేవు కదా! అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ గతంలో చేగువేరా డ్రస్ ధరించి విప్లవకారుడిని అని తిరిగారని చెప్పారు. తర్వాత వేషం మార్చి.. సావార్కర్ శిష్యుడిగా మారారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారని నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో ఉన్నాడు. కాబట్టి దిష్టి తగిలింది.. అనే పదాలు వాడుతున్నాడని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవికి తగరని నారాయణ అన్నారు. ఆయన ఈ పదవిని వదిలేసి.. గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చని.. సనాతన ధర్మంలో ఉండొచ్చని అన్నారు. ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా తగరని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ నారాయణ కోరారు.