ఒక దశలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో చివరి చిత్రం అజ్ఞాతవాసినే అనుకున్నారంతా. ఆ సినిమా తర్వాత ఇకపై సినీ రంగంలో కొనసాగనని.. రాజకీయాలకే తన జీవితం అంకితం అన్నట్లు మాట్లాడాడు పవన్. కానీ 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కొన్ని నెలలకు సినిమాల్లోకి పునరాగమనం చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్. పార్టీ నడపడానికి, కుటుంబ అవసరాలకు సినిమాల్లో కొనసాగక తప్పని పరిస్థితుల్లో ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు.
ఐతే 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో పని చేయాల్సి రావడంతో ఆయన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వీటిలో వీరమల్లు, ఉస్తాద్ చాలా ఏళ్ల ముందు మొదలైన సినిమాలు. కానీ పొలిటికల్ కమిట్మెంట్లు, మధ్యలో వేరే చిత్రాలు ముందుకు రావడం వల్ల ఇవి బాగా ఆలస్యం అయి నిర్మాతల మీద భారం మోపాయి. ఓజీ ప్రొడ్యూసర్ సైతం కొంత ఇబ్బంది పడ్డాడు. చివరికి ఈ ఏడాది ఈ చిత్రాలను పవన్ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేశాడు. వీరమల్లు, ఓజీ ఆల్రెడీ రిలీజైపోయాయి.
ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి కూడా పవన్ తన పని పూర్తి చేశాడు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతానికి ఇదే పవన్ చివరి చిత్రం అనుకుంటున్నారంతా. కానీ ఇటీవల పవన్ కొత్త సినిమాల గురించి కబుర్లు వినిపిస్తున్నాయి. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ గురించి చర్చ జరిగింది. కానీ దాని గురించి కాంక్రీట్‌గా అడుగేమీ ముందుకు పడలేదు.
కానీ ఈ మధ్య సౌత్ ఇండియాలో టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటిగా ఎదుగుతున్న కేవీఎన్ సంస్థకు పవన్ ఓ సినిమా చేయడానికి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ డైరెక్టర్లయిన లోకేష్ కనకరాజ్, హెచ్.వినోద్‌ల్లో ఒకరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు గురించి అభిమానుల్లో మాత్రం అంతగా నమ్మకం కుదరడం లేదు. పవన్ అందుబాటులోకి వచ్చి సినిమా సెట్స్ మీదికి వెళ్తే తప్ప వారు నమ్మేలా లేదు.
ఇంతకుముందు అయితే పవన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన కుటుంబ, పార్టీ అవసరాలకు డబ్బు కావాలి కాబట్టి సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ కారణం చెప్పి సినిమాలు చేయడానికి ఆస్కారముంది. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తీరిక లేకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా సినిమా చేస్తే ప్రతిపక్ష వైసీపీకి ఆయుధం ఇచ్చినట్లవుతుంది. మరోవైపు పవన్ తరచుగా ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి టైంలో కొత్తగా సినిమా చేయాల్సిన అవసరం ఉందా.. పవన్‌కు అసలు అంత ఓపిక ఉంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాబట్టి పవన్ నిజంగా కొత్త సినిమాను పట్టాలెక్కిస్తాడా లేదా అన్నది చూడాలి.