తిరుమల శ్రీవారి దర్శనం, తిరుమల పవిత్ర లడ్డు ప్రసాదం, ఈ రెండింటికోసమే అనేక వ్యయప్రయాసలను ఓర్చుకుని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు పోటెత్తుతారు. ఈ షణ్మాత్రమైనా శ్రీవారిని మనసారా దర్శించుకోవాలని, చిటికెడు పవిత్ర లడ్డు ప్రసాదాన్ని నాలికపై వేసుకోవాలని ఆశిస్తారు.
అయితే ఈ రెండూ కూడా వైసీపీ హయాంలో కల్తీ అయ్యాయని బీజేపీ నాయకుడు లంకా దినకర్ వ్యాఖ్యానించారు.
శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను అప్పటి కొందరు మంత్రులు, నాయకులు విచ్చలవిడిగా అధిక మొత్తాలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిని మరింత దారుణంగా కల్తీ చేశారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి కొంత సమాచారం వెలుగు చూసింది. దీని ఆధారంగా లంకా దినకర్ మాట్లాడుతూ — “వైసీపీ హయాంలో భోలే బాబా డెయిరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు. ఏకంగా 24 లక్షల కిలోల నెయ్యిని ఈ సంస్థ సరఫరా చేసింది. దీంతో ఆ సంస్థ ఎక్కడ నుంచి పాలు సేకరించిందనే విషయాన్ని సీబీఐ పరిశీలించింది. కానీ ఎక్కడా ఆధారాలు లేవు. పోనీ వెన్ననైనా సేకరించిందేమోనని విచారించారు. దీనికి కూడా ఆధారాలు లేవు” అని వివరించారు.
“అంటే నకిలీ పదార్థాలు వాడి ఇతర కల్తీ వస్తువులతోనే శ్రీవారి లడ్డూలు తయారు చేశారు. ఈ విషయం స్పష్టమవుతోంది. దీనిపై పూర్తిస్థాయి నివేదిక త్వరలోనే రానుంది” అని లంకా దినకర్ తెలిపారు.
ఈ కేసు విచారణను తాజాగా సీబీఐ ముమ్మరం చేసింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.