దర్శకధీర రాజమౌళి మార్కెటింగ్ గురు అని ఊరికే అనలేదు. శనివారం జరగబోయే గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ కు ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. వంద అడుగులకు పైగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ని సెట్ చేస్తున్న విధానం చూస్తేనే మతి పోతోంది. అలాంటిది దాని మీద మూడు నిమిషాల కంటెంట్ చూస్తే అభిమానులు ఏమైపోతారో ఊహించుకోవడం కష్టమే. అయితే ఈవెంట్ కి ఎవరు బడితే వారు రాకూడదని, స్పష్టంగా నిబంధనలు, దారికి సంబంధించిన సూచనలు చెబుతూ రాజమౌళి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాసులు ఉంటేనే రమ్మని మరీ మరీ చెప్పారు.
ఇప్పుడా పాసుల జారీ మొదలైపోయింది. ఏదో ఆషామాషీగా రెగ్యులర్ ఈవెంట్ లకు చూసే కార్టు ముక్కలు పెట్టలేదు. ఏకంగా పాస్ పోర్ట్ తరహాలో పసుపుపచ్చ రంగులో చిన్న బుక్ ప్రింట్ చేసి అందులో ఈవెంట్ వివరాలు, డైరెక్షన్లు, గూగుల్ మ్యాప్ ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ కూడా పొందుపరిచారు. చూడగానే ముద్దొచ్చేలా ఉన్న ఈ చిన్న పుస్తకం తాలూకు ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ఆల్రెడీ ట్రెండింగ్ మొదలుపెట్టారు. వేడుక అయిపోయాక పారేయకుండా దాచుకునే విధంగా డిజైన్ చేయడం అసలు విశేషం. లోపల మెయిన్ క్యాస్టింగ్ పిక్స్ పొందుపరచడం మరో హైలైట్.
ఇదంతా చూస్తుంటే రాజమౌళి లాగా ఎవరూ ఆలోచించలేరన్నది అర్థమవుతోంది. ఎంత ఖర్చవుతోందనేది ఇప్పుడే అంచనాకు రాలేం కానీ పైపైన లెక్కేసినా కోట్ల రూపాయల వ్యయం కళ్ళముందు కనిపిస్తోంది. జియో హాట్ స్టార్ భారీ మొత్తం చెల్లించి హక్కులు సొంతం చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ తరహాలో ప్రత్యక్షంగా ఎన్ని కోట్ల మంది చూస్తున్నారో ప్రతి సెకను డిస్ప్లే అయ్యే నెంబర్ ని స్క్రీన్ మీద చూపించనుంది. రాబోయే రోజుల్లో ఇతర ప్యాన్ ఇండియా సినిమాల డైరెక్టర్లు, హీరోలు రాజమౌళి కన్నా కొత్తగా ఆలోచించడం సవాల్ గా ఫీలవుతారు. అయినా సరే జక్కన్న థాట్ ప్రాసెస్ లో ఆయన దగ్గరికి వెళ్లడం అసాధ్యం.