ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. శుక్రవారం ఉదయం స్థానిక ఓ కాలేజీలో సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారు. అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
అదేవిధంగా పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం శనివారం.. నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలులో పర్యటించనున్నారు. అధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. పిఠాపురం పరిధిలో ఇళ్లులేని పేదలకు గొల్లప్రోలులో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలను కూడా పవన్ పరిశీలిస్తారు. తర్వాత.. పిఠాపురం నియోజకవర్గం సహా జిల్లాలో శాంతి భద్రతలు.. ఇతర అంశాలపై జిల్లా ఎస్పీతోనూ పవన్ భేటీ అయి సమీక్షించనున్నారు.
అనంతరం రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతోనూ పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మొత్తంగా మూడు రోజుల పర్య టనలో ఇటు సంక్రాంతి సంబరాలతోపాటు.. అటు.. రాజకీయ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ది పనుల తోనూ బిజీబిజీగా గడపనున్నారు.
దీంతో స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో జోష్ పెరిగింది. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.