hyderabadupdates.com movies పెళ్లి కబురు చెప్పిన మెగా హీరో

పెళ్లి కబురు చెప్పిన మెగా హీరో

టాలీవుడ్లో ప్రతి సంవత్సరం కొందరు స్టార్ల వివాహాలు చూస్తుంటాం. ఇటీవలే ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి కూడా కొత్త ఏడాదిలో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఐతే వయసులో వీళ్లందరి కంటే పెద్దవాడైన సాయి ధరమ్ తేజ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడికి 39 ఏళ్లు వచ్చేశాయి. సినిమాల్లోకి వచ్చి 13 ఏళ్లు దాటిపోయింది. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం పెళ్లి కావాల్సిన అతి పెద్ద వయస్కుడు అతనే. 

ఇలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు మీడియా ముందుకు వచ్చినపుడు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడం మామాలే. తాజాగా తేజు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి కదా అని మీడియా వాళ్లు ప్రస్తావించారు. అందుకు తేజు బదులిస్తూ.. వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని చెప్పాడు. ఐతే మీడియా వాళ్లకు క్యాజువల్‌గా అలా బదులిచ్చాడా.. లేక నిజంగానే తేజు పెళ్లికి రంగం సిద్ధమవుతోందా అన్నది ఆసక్తికరం.

ఇక తన కెరీర్ గురించి తేజు మాట్లాడుతూ.. తాను నటిస్తున్న సంబరాల యేటిగట్టు వచ్చే ఏడాది విడుదలవుతుందని.. ఆ సినిమా బాగా వస్తోందని.. ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేందుకు తిరుమలకు వచ్చానని.. కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శనం చేసుకున్నానని తేజు తెలిపాడు. తేజు చివరగా 2023లో ‘బ్రో’ మూవీతో పలకరించాడు. 

రోడ్డు ప్రమాదం తాలూకు ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకునేందుకు అతను తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఆపై కొత్త దర్శకుడు రోహిత్ కేపీతో ‘సంబరాల యేటిగట్టు’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ దసరాకే ఈ సినిమా రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Related Post