తెలంగాణలో పదేళ్ల పాటు వేచి చూసి.. 2023 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పాలన చేపట్టి.. ఈ నెల(డిసెంబ రు) 9వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తికానున్నాయి. అప్రతిహత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధిపత్యానికి, పాలనకు చెక్ పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి.. రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 1 నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజాపాలన ఉత్సవాలు’ చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక, చివరి రెండు రోజులు 8, 9 తేదీల్లో మరింత ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రెండేళ్లలో..
ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు సాగిందా? అనే ప్రశ్న వచ్చినప్పుడు చెప్పడానికి ఒకింత తర్జన భర్జన తప్పదు. మంత్రుల మధ్య సఖ్యత, ఎమ్మెల్యేల వివాదాలు.. అవినీతి, ఆధిపత్య ధోరణలు స్పష్టంగా కనిపించాయి. అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తర్వాత.. ఇవి కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి. అయినా.. ఇంకా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదన్నది పరిశీలకులు చెబుతున్నమాట. ఆది నుంచి సీనియర్ల హవాతో నిండిన కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తొలినాళ్లలో ఎదురీతను ఎదుర్కొన్నారు. అయితే.. అధిష్టానం పూర్తి అండదండలు ఆయనకు ఉండడంతో పాలన సజావుగానే సాగిందని చెప్పాలి.
ప్రజాకోణంలో..
ప్రజాకోణంలో చూసుకుంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికీ కొన్ని అమలు కాకపోవడం గమనార్హం. అయితే.. అమలు అవుతున్నవి మాత్రం ఒకింత పార్టీకి సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసినా.. కొందరికి ఇంకా ఈ ఫలాలు చేరువ కాలేదన్నది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్న చర్చ. అదేవిధంగా ప్రతి మహిళకు ఇస్తామన్న నెల నెలా సొమ్ములు ఇంకా ప్రారంభమే కాలేదు. ఇక, అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రస్తుతం పట్టాలెక్కే దశలోనే ఉన్నాయి. కేసీఆర్‌ను మరిపించేలా పాలన చేస్తామని చెబుతున్నా.. ఎక్కడో ఒకింత లోపం అయితే కనిపిస్తోందన్నది ప్రజల మధ్య జరుగుతున్న చర్చ.
పొంచిన ముప్పు!
రాజకీయంగా తెలంగాణలో పార్టీలు పుట్టగొడుగుల్లా ఉన్నాయన్నది వాస్తవం. వీటిలో గెలిచిన, ఓడిన పార్టీలతో పాటు మరికొన్ని చిన్నా చితక పార్టీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ ఎస్‌తో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి పోటీ పెరుగుతూనే ఉంది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. అధికారానికి ప్రమాదం పొంచి ఉందన్న వాదన కూడా ఉంది. గత ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ.. తర్వాత.. 10 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా 74 సంఖ్యాబలానికి చేరుకున్నా.. ఈ పది మందిపై కేసులు.. వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో గెలుపు ఒకింత నైతిక బలం ఇచ్చినా.. వచ్చే ఎన్నికల నాటికి మరింత గ్రాఫ్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పరిశీలకులు చెబుతున్నమాట.