16 ఏళ్ల కిందట ‘మగధీర’ సినిమాతో తెలుగు సినిమా తలెత్తుకుని చూసేలా చేశాడు రాజమౌళి. ఆ సినిమా గొప్పదనమేంటో అప్పటికి మిగతా ఇండస్ట్రీలు గుర్తించలేకపోయాయి. కానీ ‘ఈగ’తో రాజమౌళి మామూలోడు కాదనే విషయం దేశం మొత్తానికి బాగానే అర్థమైంది. ఇక ‘బాహుబలి’తో జక్కన్న రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మొత్తంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే ఆ చిత్రంతో మార్చేశాడు రాజమౌళి.
మనం ఎంత భారీ కలనైనా కలొచ్చని.. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతాలు చేయొచ్చని.. ప్రపంచ సినిమాకు మన చిత్రాలు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించవచ్చని ఆయన రుజువు చేశాడు. ఆ దెబ్బతో భారతీయ సినిమాల కథలు, మేకింగ్, బడ్జెట్లు.. అన్నీ మారిపోయాయి. ఎందరో ఫిలిం మేకర్స్‌కు, నిర్మాణ సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తూ ధైర్యాన్నిచ్చింది ‘బాహుబలి’. కాబట్టే ఇప్పుడు ‘రామాయణం’ సహా ఎన్నో విజువల్ వండర్స్ రూపొందుతున్నాయి.
రాజమౌళి ద్వారా స్ఫూర్తి పొందిన దర్శకుల్లో కన్నడ ఫిలిం మేకర్ ప్రశాంత్ నీల్ కూడా ఒకడు. అతను ‘కేజీఎఫ్’ అనే భారీ కథ రాసుకుని, తన విజన్‌కు తగ్గట్లుగా భారీగా ఆ సినిమాను తీసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అందుకోవడం వెనుక జక్కన్న స్ఫూర్తి ఉందని ఇంతకుముందే చెప్పాడు ప్రశాంత్. ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ నేపథ్యంలో మరోసారి జక్కన్న మీద ప్రశాంత్ ప్రశంసలు కురిపించాడు. జక్కన్న ఇచ్చిన స్ఫూర్తిని అతను ఒక కథ రూపంలో చెప్పడం విశేషం.
‘‘ఒక రోడ్డుకు మరమ్మతులు అవసరం అయ్యాయి. దీంతో అందరూ కలిసి ఒక కాంట్రాక్టర్‌ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాదు.. ఏకంగా దాన్ని 16 వరసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు రాజమౌళి’’ అంటూ జక్కన్నకు ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. రీ రిలీజ్ నేపథ్యంలో బాహుబలి టీంకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మెసేజ్ పోస్ట్ చేశాడు ప్రశాంత్.