hyderabadupdates.com movies ప్రశాంత్ వర్మ తొందరపడే టైమొచ్చింది

ప్రశాంత్ వర్మ తొందరపడే టైమొచ్చింది

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కొద్దిరోజుల క్రితం మీడియా సర్కిల్స్, సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యాడో చూశాం. నిర్మాత నిరంజన్ రెడ్డి, తన మధ్య జరిగిన ఆరోపణలు ప్రత్యారోపణలతో వ్యవహారం ఫిలిం ఛాంబర్ కు చేరింది. ఇంకా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టలేదు కానీ త్వరలోనే ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్న సినిమాల్లో జై హనుమాన్ కీలకమైంది. రిషబ్ శెట్టి నటిస్తుండటంతో అంచనాలు అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే పీక్స్ లో ఉన్నాయి. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణమంటే ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు.

ఇదంతా ఓకే కానీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రశాంత్ వర్మ వీలైనంత తొందరపడటం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి వారణాసిలో ఏకంగా మహేష్ బాబుతోనే రాముడి వేషం వేయించారు. దీంతో సహజంగానే హనుమంతుడి క్యారెక్టర్ తను చేసే విన్యాసాలు ఎంతో కొంత ఉంటాయి. రన్బీర్ కపూర్ రామాయణం గురించి తెలిసిందే. నితీష్ తివారి ఇప్పటికే మొదటి భాగం షూట్ పూర్తి చేశారు. ఇది ఫుల్ లెన్త్ ఎపిక్ కాబట్టి హనుమంతుడి పాత్ర ఎక్కువసేపు ఉంటుంది. అందులోనూ సన్నీ డియోల్ చేశాడంటే మరింత ఫోకస్ ఖాయం. ఈ రెండు సినిమాలు వేల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నవి.

ఇవి వచ్చాక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ వస్తే కనక విజువల్స్, మేకింగ్, విఎఫెక్స్, కంటెంట్ పరంగా ఖచ్చితంగా పోలికలు వస్తాయి. తేజ సజ్జతో హనుమాన్ తీసినప్పుడు ఏ సమస్యా లేదు. ఎందుకంటే అప్పుడు మార్కెట్ లో అలాంటి ఫాంటసీ మూవీ ఏదీ లేదు కాబట్టి. కానీ జై హనుమాన్ రిలీజయ్యే నాటికి రన్బీర్, మహేష్ ఇద్దరి సినిమాలు వచ్చేసి ఉంటాయి. వాటికన్నా మెరుగ్గా తన జై హనుమాన్ ని చూపిస్తేనే ప్రశాంత్ వర్మ పాసవుతాడు. ఇది చాలా పెద్ద సవాల్. హనుమాన్ టైంకి, జై హనుమాన్ మొదలుపెట్టే నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.

Related Post