పెళ్లి చేసుకుని భర్తతో విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంకా చోప్రా గురించి తెలుగు మూవీ లవర్స్ మాట్లాడుకునే సందర్భం వస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా. అప్పుడెప్పుడో రామ్ చరణ్ తుఫానులో నటించిన తర్వాత మళ్ళీ తను టాలీవుడ్ స్టార్లతో జత కట్టలేదు. మనకు సెట్ కాదనో లేక అంత రెమ్యునరేషన్ ఇవ్వలేకనో కారణం ఏదైతేనేం దర్శక నిర్మాతలు ఆమెను ఆప్షన్ గా పెట్టుకోలేదు. కానీ రాజమౌళి ఈ లెక్కలన్నీ మార్చేశారు. ఒక్కసారిగా ప్రియాంకా చోప్రాని లైమ్ లైట్ లోకి తెచ్చేశారు. ఎస్ఎస్ఎంబి 29 కోసం తనను ఎంపిక చేసినప్పుడు షాక్ తిన్నవాళ్ళే ఎక్కువ. ఇప్పటికీ తను హీరోయినా అని అడుగుతున్న ఫ్యాన్స్ లేకపోలేదు.
నిజానికి ప్రియాంకా చోప్రాకు టాలీవుడ్ కనెక్షన్ ఇప్పటిది కాదు. మిస్ ఇండియా అయ్యాక 2002లో తొలి అవకాశం తెలుగు నేల నుంచే వచ్చింది. మధుకర్, ప్రసన్న హీరోలుగా నటించిన అపురూపం అనే సినిమాతో తన తెరంగేట్రం జరిగింది. కొంత భాగం షూటింగ్ జరిగి ఫస్ట్ లుక్ వచ్చాక దాని షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోవడం, అక్కడ హిట్లు పడి స్టార్ గా సెటిల్ కావడం జరిగిపోయాయి. ఇదంతా 23 సంవత్సరాల వెనుకటి మాట. ఇంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా ఒక ప్యాన్ వరల్డ్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం అనేది తన డెబ్యూ లాగే ఒక అపురూపమైన జ్ఞాపకం.
రేపు జరగబోయే గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ లో ఇంకేం విశేషాలు పంచుకోబోతోందో చూడాలి. ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ ని బట్టి చూస్తే ప్రియాంకా చోప్రా ఇందులో యాక్షన్ టచ్ ఉన్న హీరోయిన్ గా నటిస్తోంది. చీరకట్టుకుని కొండాకోనల్లో బుల్లెట్ల వర్షం మధ్య ఫైట్ చేస్తోందంటే రాజమౌళి ఏదో ఆషామాషీగా డిజైన్ చేసినట్టు లేడు. ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ కు ఎక్కువ స్కోప్ దొరకలేదు. కానీ మహేష్ బాబు మూవీలో అలాంటి సమస్య లేదట. నిడివి పరంగా, పెర్ఫార్మన్స్ పరంగా జక్కన్న తన పాత్రకి హై యాక్షన్, ఎమోషన్స్ పెట్టారట. రేపు టీజర్ లో ఏమైనా సాంపిల్స్ వదులుతారేమో చూడాలి.