hyderabadupdates.com movies బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!

బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!

కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఏడాది వయసున్న చిన్నారి ఉండడం, ఆ పసిపాప పక్కనే ఆమె తల్లి విగత జీవిగా పడి ఉండడం కలచివేస్తోంది.

టిప్పర్ లారీలోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడడంతో చాలామంది కంకర కింద చిక్కుకున్నారు. ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి అదే కారణం. దాదాపు 10 మంది ప్రయాణికులు కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో బస్సు, టిప్పర్‌ డ్రైవర్లు కూడా చనిపోయారు. ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

తాండూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే, ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post