రాందేవ్ బాబాగా ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ క్రియా యోగ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయనకు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడద చుట్టుకుంది. పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు.. మహిళలు, పురుషుల సౌందర్య సాధనాల వ్యాపారాన్ని రాందేవ్ చేస్తున్న విషయం తెలిసిందే. తరచుగా ఈయన విమర్శలలో చుట్టుకుంటున్నారు.
ఇదిలావుంటే.. ట్రంప్ విధించిన సుంకాలతో పలు వ్యాపారలపై ప్రభావం పడినట్టుగానే.. పతంజలి ఉత్పత్తుల పై కూడా తీవ్ర ప్రభావం పడింది. గత రెండు నెలల కాలంలో పతంజలి ఉత్పత్తుల అమెరికా ఎగుమతులు.. 35 శాతానికి పడిపోయాయి. ఇది వ్యాపార పరంగా.. రాందేవ్‌కు తీవ్ర దెబ్బతగిలేలా చేసింది. దీంతో రాందేవ్ బాబా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన తరచుగా విమర్శించే మోడీ విధానాలను మెచ్చుకోవడం.. తాను స్టార్ క్యాంపెయినర్‌గా మారుతానని చెప్పడం గమనార్హం.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న వంకతో భారత్‌పై ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించారు. దీనివల్ల భారత్లోని అనేక పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా సౌందర్యసాధనాలు, మందులు, ఆక్వా ఉత్పత్తులు, ఆహారం వంటివాటిపై సుంకాల ప్రభావం ఉంది. దీంతో ప్రధాని మోడీ యూటర్న్ తీసుకుని అమెరికా జోలికి పోకుండా.. స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన గత రెండు మాసాలుగా ప్రచారం కూడా చేస్తున్నారు.
అయితే.. ఇలా స్వదేశీ ఉత్పత్తులను పెంచడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి ఏమేరకు ప్రభావితం అవుతుందని గతంలో రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం మౌనంగాఉంది. అయితే.. ఇప్పుడు సుంకాల బాధ తనవరకు వచ్చే సరికి బాబా యూటర్న్ తీసుకున్నారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం మంచిదేనని.. తద్వారా ప్రపంచ దేశాలకు ముకుతాడు వేయొచ్చన్నారు. తాను కూడా స్టార్ క్యాంపెయినర్‌గా మారి.. ప్రచారం చేస్తానని చెప్పారు. ఇదేసమయంలో ట్రంప్ చేస్తున్నది సుంకాల పెంపు కాదన్న ఆయన.. ఆర్థిక యుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.