hyderabadupdates.com movies బాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారు

బాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి ఫిదా అయ్యారు. అది కూడా ఆయ‌న ఇటీవ‌ల కాలంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రెండు విష‌యాల‌పై సంతోషం వ్యక్తం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, అంద‌రూ చంద్ర‌బాబుతో స‌హా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

విష‌యం ఏంటంటే, తాజాగా మొంథా తుఫాను ప్ర‌భావంతో 22 జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దోబూచులాడిన ఈ మొంథా మంగళ‌వారం అర్థ‌రాత్రి తీరం దాటింది.

అయితే ఈ క్ర‌మంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించారు. ఫ‌లితంగా ప్రాణ న‌ష్టం త‌ప్పింది. అయితే చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డానికి కార‌ణం ఇది కాదు.

ఈ క్లిష్ట స‌మ‌యంలో రెండు వ‌ర్గాలు ఆయ‌న చెప్పిన‌ట్టు విన‌డం, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయ‌డం ఆయనను ఆక‌ట్టుకున్నాయి.

స‌చివాల‌య సిబ్బంది: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌చివాల‌య సిబ్బంది ప‌గ‌లు రేయి తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సేవ‌లు అందించారు. కొంద‌రు సెక్ర‌ట‌రీలు (గ్రామ‌, వార్డు) ఇంటికి వెళ్ల‌కుండా కార్యాల‌యాల్లోనే ఉన్నారు.

ఈ విష‌యం తెలిసిన చంద్ర‌బాబు వారి విష‌యంలో సంతోషం వ్య‌క్తం చేశారు. “అంద‌రినీ అభినందిస్తున్నాను” అని ఆర్టీజీఎస్ కేంద్రంలో నిర్వ‌హించిన స‌మావేశంలో పేర్కొన్నారు. స‌హ‌జంగా ఉద్యోగుల‌ను మెచ్చుకోర‌న్న అపప్ర‌ద‌ను ఈ చ‌ర్య‌లతో చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు.

ఎమ్మెల్యేల స‌హ‌కారం: ఇప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు ఆగ్ర‌హానికి గుర‌వుతూనే ఉన్నారు. కానీ తాజాగా తుఫాను నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు.

బాధిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు చేర్చ‌డంతోపాటు వారికి అందిస్తున్న ఆహారాన్నివారు కూడా రుచి చూశారు. ప‌డ‌క ఏర్పాట్ల నుంచి స‌క‌లం వారి క‌నుస‌న్న‌ల్లోనే సాగాయి. ముప్పిడి వెంక‌టేశ్వ‌రరావు స‌హా అనేక మంది ఎమ్మెల్యేలు క్షేత్ర‌స్థాయిలో సేవ‌లు అందించారు.

దీంతో సీఎం చంద్ర‌బాబు మురిసిపోయారు. “ఇలా క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేస్తే మ‌ళ్లీ మ‌నల్నే ప్ర‌జ‌లు ఆద‌రిస్తారు” అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Related Post