తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నడిగడ్డ ప్రాంతంలో వసూల్ రాజాలు తిరుగుతున్నారని, సంపత్ కుమార్ ఇసుక దందాను కొనసాగిస్తున్నారని విజయుడు ఆరోపించారు.
అంతేకాదు, దీనికి అడ్డువచ్చిన మండల అధికారులను వెంటవెంటనే బదిలీలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు విజయుడు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాట సందర్భంగా విజయుడిని మల్లు రవి దుర్భాషలాడారని, దాడి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. సంపత్ అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే విజయుడిపై మల్లు రవి దాడి చేశారని ఆరోపణలు గుప్పించారు. విజయుడిపై మల్లు రవి చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు ఇంతకు దిగజారారని, చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు గౌరవం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. విజయుడికి ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.