తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందన్నారు. భారతీయురాలిగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
దేశం కోసం మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం పదవుల కోసమో, అధికారం కోసమో కాకుండా.. సామాన్య ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే కమల దళంలో చేరాను అని ఆమె వివరించారు.
నటిగా సమాజంలోని వివిధ వర్గాలను దగ్గర నుంచి గమనించిన అనుభవం ఉన్న ఆమనికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో పలువురు తెలుగు హీరోయిన్లు ఆయా పార్టీలలో చేరి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా గెలిచారు. ఆ జాబితాలో ఇప్పుడు ఆమని వచ్చి చేరింది. ఆమని రాకతో బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందేమో వేచి చూడాలి.