దీపావళి పండుగ వేళ సీఎం చంద్రబాబు తన అధికారిక ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి సామాన్యులతో కలిసి పోయారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అత్యంత రద్దీగా ఉండే.. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో సుమారు గంటన్నరపాటు ఆయన కలియ దిరిగారు. ప్రతి వీధి దుకాణ దారుడిని ఆయన పలకరించారు. జీఎస్టీ 2.0 వల్ల కలుతున్న మేలును, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల తీరును కూడా తెలుసుకున్నారు. వాస్తవానికి విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమం అనంతరం.. ఆయన తిరుగు ప్రయాణంలో విజయవాడ సిటీలోకివచ్చారు. దీపావళి వేళ క్రయ విక్రయాలతో అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డును ఆయన ఎంచుకున్నారు. నేరుగా కాన్వాయ్‌ను అక్కడకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌లో బీసెంట్ రోడ్డు అంశం లేదు. అయితే..అనూహ్యంగా పండుగ వేళ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బీసెంట్ రోడ్డు వద్దకుకాన్వాయ్‌వచ్చి ఆగడం, పోలీసుల హడావుడితో తొలుత వినియోగదారు లు, దుకాణ దారులకు కొంత ఇబ్బంది ఏర్పడింది. అయితే..చంద్రబాబు ఎలాంటి బందోబస్తు వద్దని.. ఎవరి పనులు వారు చేసుకోవాలనిపేర్కొనడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
అనంతరం పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి బాలకృష్ణతో మాట్లాడారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న గొడవర్తి లక్ష్మీ అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌కు వచ్చిన కొందరు కొనుగోలు దారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.