ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కీలకమైన రాష్ట్రం బీహార్‌లో తాను కూడా ప్రచారం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ దశాబ్దపు నాయకుడిగా అభివర్ణించిన ఆయన, సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ పురోభివృద్ధిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు అవుతుందని అన్నారు.
దీనికి సంబంధించి తన వంతు పాత్ర పోషిస్తానన్న చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో తనకు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉందని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం ద్వారా మోడీ అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. షెడ్యూల్ నిర్ణయించిన తర్వాత తాను కూడా బీహార్‌లో పర్యటించి ఎన్డీయే విజయం కోసం బాటలు వేస్తానని తెలిపారు.
ఇక ఇటీవల దసరా ముందు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలు పొదుపు చేసుకుంటున్నారని తెలిపారు.
ఇది ఒకరకంగా పెద్ద సంస్కరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా పన్నులు పెంచిందే తప్ప తగ్గించలేదు. ఇలా జరగడం ఇదే తొలిసారి. దీనికి ప్రధాని మోడీ ఉదారతే కారణం. అందుకే ఆయన దశాబ్దపు నాయకుడు అనిచెబుతా. దీని వల్ల పేదలు, మధ్యతరగతి పరోక్షంగా లాభం పొందితే, వ్యాపార వర్గాలకు కూడా ప్రత్యక్ష లాభం జరుగుతోంది. ప్రధాని మోడీకి విజయాలే తప్ప ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరుగరు. 2000 సంవత్సరం నుంచి ఆయన 25 ఏళ్లుగా అప్రతిహతంగా విజయం దక్కించుకుంటున్నారు. అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీలో…
ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీని అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ ద్వారా ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఇది తమకు సానుకూలంగా మారుతుందని, వచ్చే ఎన్నికలలోనూ తాము విజయం దక్కించుకుంటామని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు.