hyderabadupdates.com movies బుచ్చిబాబు… భలే అసాధ్యుడివయ్యా

బుచ్చిబాబు… భలే అసాధ్యుడివయ్యా

పెద్ది ప్రమోషన్ల గేరు మార్చేందుకు దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నారు. వచ్చే వారం హైదరాబాద్ లో జరగబోయే ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ సందర్భంగా మొదటి పాటను రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. దీని కోసం ఒక ప్రత్యేక ప్రోమో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఉప్పెన సమయంలో పాటించిన స్ట్రాటజీనే ఇప్పుడూ ఫాలో అవుతూ తాను, రెహమాన్ సంభాషించుకుంటున్నట్టు ఒక వీడియో చేసి దాని ద్వారా సాంగ్ డేట్, టైం అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. మాములుగా రెహమాన్ ఇలాంటి ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు.

కానీ బుచ్చిబాబుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఒకవేళ నిజంగా జరిగితే మాత్రం తనని అసాధ్యుడు అనుకోవచ్చు. ఇప్పటిదాకా రెహమాన్ కొన్ని తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు పని చేశారు కానీ అవేవి ఆశించిన స్థాయిలో మ్యూజిక్ లవర్స్ ని మెప్పించలేకపోయాయి. గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్ నుంచి కొమరం పులి దాకా ఎన్నో ఉన్నాయి. ఏ మాయ చేసావే లాంటివి వర్కౌట్ అయ్యాయి కానీ దాని ఒరిజినల్ ఫ్లేవర్, కంపోజింగ్ తమిళంలో మొదలయ్యాయనేది మర్చిపోకూడదు. అందుకే పెద్ది ఆల్బమ్ ని రెహమాన్ సైతం చాలా అంటే చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు.

ఇప్పటిదాకా అరవై శాతం షూట్ పూర్తి చేసుకున్న పెద్ది శ్రీలంక షెడ్యూల్ లో పాట చిత్రీకరణ ముగించేసింది. ఈ సాంగే త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 27 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేకుండా బుచ్చిబాబు అదే టార్గెట్ తో రేయింబవళ్లు పని చేస్తున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ చేయబోయే సినిమా తన గురువు సుకుమార్ తో కాబట్టి అంతకు ముందు వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలనే కసితో తెరకెక్కిస్తున్నట్టు యూనిట్ టాక్. బిజినెస్ డీల్స్ ఇంకా మొదలుపెట్టని పెద్ది ట్రైలర్ తర్వాత ఆఫర్లను పరిశీలించే ప్లాన్ లో ఉందట. ట్రేడ్ వర్గాల్లో పెద్దికున్న క్రేజ్, డిమాండ్ చూస్తే ఊహించని రేట్లు పలకడం ఖాయం.

Related Post