కొద్దిరోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. శర్వానంద్ బైకర్ డిసెంబర్ 6 విడుదల కావడం లేదు. కొత్త డేట్ ని ప్రకటించలేదు కానీ వాయిదా వార్తను యువి సంస్థ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అసలు విశేషం ఇది కాదు. ఈ సినిమాని 3డి, 4డిఎక్స్ లాంటి ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తామని, జీవితంలో ఒకసారి మాత్రమే కలిగే అనుభూతికి సిద్ధం కమ్మని ప్రకటనలో పేర్కొంది. రేసర్ల జీవితాల మీద రూపొందిన బైకర్ కోసం శర్వా విపరీతంగా కష్టపడ్డాడు. బరువు తగ్గించుకుని నమ్మశక్యం కానంత సన్నబడ్డాడు. సబ్జెక్టు అంతగా నచ్చడం వల్లే ఆరోగ్యం పరంగా రిస్క్ అయినా సరే ఎక్కువ కాల్ షీట్లు ఇచ్చాడు.
సరే వినడానికి బాగానే ఉంది కానీ బైకర్ లో నిజంగా 3డి డిమాండ్ చేసే కంటెంట్ ఉందానేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బైకు ఛేజులు, యాక్షన్ ఎపిసోడ్లు ఇవన్నీ మాములుగా చూసినా కిక్ ఇస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో వీటిని డిజైన్ చేసి ఉండొచ్చు కానీ 3డి సాంకేతికత అవసరం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది కంటెంట్ చూస్తే కానీ చెప్పలేం. గతంలో ఆర్ఆర్ఆర్ లాంటివి 3డి రూపంలో వచ్చాయి కానీ జనం పెద్దగా పట్టించుకోలేదు. రెగ్యులర్ వర్షన్లకే ప్రాధాన్యం ఇచ్చి బ్లాక్ బస్టర్ చేశారు. త్వరలో రిలీజ్ కానున్న అఖండ 2 తాండవం కి బోయపాటి శీను బృందం ఈ టెక్నాలజీని వాడింది.
ఒక్కటి మాత్రం నిజం. ఆడియన్స్ నిజంగా ఇది 3డిలో చూస్తేనే బాగుందనే స్థాయిలో తెరమీద అవుట్ ఫుట్ కనిపించాలి. అప్పుడే తను పెట్టిన టికెట్ డబ్బులకు న్యాయం జరిగిందని ఫీలవుతాడు. ఎందుకంటే ప్రతి టికెట్ మీద అదనంగా పాతిక నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటున్నప్పుడు అంచనాలు మరింత పెరుగుతాయి. అలా కాకుండా బలవంతంగా చేశారనే ఫీలింగ్ రాకూడదు. ఆ మధ్య జగదేకవీరుడు అతిలోకసుందరి విషయంలో ఈ పొరపాటు జరిగింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన బైకర్ ఒకవేళ డిసెంబర్ లో రాకపోతే సంక్రాంతికి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా శర్వా మరో మూవీ నారి నారి నడుమ మురారి తప్పుకుంటేనే.