ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో ఒక మహిళ చేసిన కిరాతకం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చి మరీ కిరాయి హంతకులతో హత్య చేయించింది. ప్రియుడి వ్యామోహంలో పడి కట్టుకున్న వాడినే కాలయముడిలా మారి అంతమొందించింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాలకు చెందిన శ్రీనుకు, ఝాన్సీకి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఝాన్సీ మరొకరితో సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శ్రీను ఇటీవల ఒక గంజాయి కేసులో అరెస్టయి జైలుకు వెళ్ళాడు. భర్త జైల్లో ఉన్న సమయంలో ఝాన్సీ తన తమ్ముడితో కలిసి అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
శ్రీను జైల్లో ఉంటే తమకు ప్రమాదం లేకపోయినా, ఎప్పటికైనా అతను బయటకు వస్తే తమ సంబంధానికి ఇబ్బందులు తప్పవని ఝాన్సీ భావించింది. అందుకే పక్కా వ్యూహంతో జైల్లో ఉన్న భర్తకు ఆమె స్వయంగా బెయిల్ ఇప్పించింది. బయటకు వస్తే ఏదో ఒక సాకుతో చంపేయవచ్చని పథకం రచించి, అందుకోసం రూ. 2 లక్షల సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను సిద్ధం చేసింది.
బెయిల్ రావడంతో శ్రీను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే, ఝాన్సీ తన తమ్ముడి సహకారంతో హంతకులను రంగంలోకి దించింది. కిరాయి ముఠా శ్రీనును అత్యంత కిరాతకంగా నరికి చంపారు. తనను జైలు నుంచి విడిపించడానికి భార్య పడుతున్న తాపత్రయం చూసి పాపం ఆ భర్త నమ్మాడు, కానీ అదే తన మరణానికి బాట వేస్తుందని ఊహించలేకపోయాడు.
పోలీసుల విచారణలో ఈ దారుణమైన నిజాలన్నీ బయటపడ్డాయి. జైల్లో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించి మరీ హత్య చేయించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. నిందితురాలు ఝాన్సీతో పాటు ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.