వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై సీఎం చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి సహా.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పోతుల సునీత.. ఇప్పటికే చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. వచ్చే సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఈలోగా మరింత మంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు దృష్టికి టీడీపీ ఎమ్మెల్సీలు తీసుకువెళ్లారు.
తాజాగా జయమంగళ వెంకటరమణ చేసిన రాజీనామాను చైర్మన్ తిరస్కరించారు. సరైన ఫార్మాట్లోనే రాజీనామా చేసినా.. దీనికి సంబంధించి తాను అడిగిన వివరణలో సరైన సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ సదరు రాజీనామాను చైర్మన్ తిరస్కరించారు. ఈ విషయం కూడా చంద్రబాబు చర్చించారు. జయమంగళతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వాస్తవానికి జయమంగళ వెంకట రమణ ఏడాదిన్నర కిందటే రాజీనామా చేశారు. అయినా.. ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఆయన జనసేనలో చేరారు. ఇక, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ వంటివారి రిజైన్ లు కూడా పరిశీలనలోనే ఉన్నాయి.
ఈ క్రమంలో చైర్మన్ పై తమకు విశ్వాసం లేదని.. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన చైర్మన్.. వైసీపీ చెప్పినట్టు చేస్తున్నారని పలువురు ఎమ్మెల్సీలు ఆరోపించారు. అయితే.. నేరుగా చైర్మన్‌ను ఏమీ అనొద్దని.. అవిశ్వాసం పెట్టుకునే హక్కు సభ్యులకు ఉంటుందని.. ఆ విషయంపైనే మాట్లాడాలని చంద్రబాబు సూచించారు.
చైర్‌ను అనవసర వివాదంలోకి లాగొద్దని.. ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక్కొక్కరుగా కాకుండా.. ఎవరైతే.. అవిశ్వాసం పెట్టాలని అనుకుంటున్నారో.. అందరూ కలిసి ఒకే తీర్మానం ప్రవేశ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
దీనిపై నాయకులతో చర్చించాలని.. సీనియర్ ఎమ్మెల్సీలను చంద్రబాబు ఆదేశించారు. అందరూ ఒకే మాటపై ఉండి.. అవిశ్వాసం పెడితే.. అది వీగిపోకుండా కూడా చూడాలని సూచించారు. ఏదో పెట్టామంటే పెట్టామని అనుకుంటే.. వైసీపీ దానిని రాజకీయ వస్తువుగా వాడుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అందరి నుంచి సమాచారంతీసుకుని తదుపరి సమావేశాల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ ఎమ్మెల్సీలకు పేర్కొన్నారు.