మాస్ రాజా రవితేజ కొత్త సినిమా మాస్ జాతర వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ ఆ సమయానికి సినిమాను రెడీ చేయలేక వాయిదా వేశారు. జులైలో ఒక డేట్ అనుకుని, అప్పుడు కూడా కుదరక వెనుకంజ వేశారు. చివరికి ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ దిశగా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. కానీ ఆ డేట్‌కు కూడా సినిమా రాలేదు. అప్పుడు వాయిదా వేసింది సినిమా రెడీ కాక కాదని.. వేరే కారణాలని వార్తలు వచ్చాయి.
ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన చివరి చిత్రం కింగ్డమ్‌తో పాటు, ఆయన తన బేనర్ మీద రిలీజ్ చేసిన వార్-2 నిరాశపరచడం.. ఆ సినిమాల రిలీజ్ ముందు అతను చేసిన కామెంట్లు తర్వాత ట్రోల్ మెటీరియల్‌గా మారడం.. ఈ నేపథ్యంలోనే అప్పటి నెగెటివిటీని తట్టుకోలేక నాగవంశీ మాస్ జాతరను వాయిదా వేయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ పైకి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యమే వాయిదాకు కారణమని చెప్పుకున్నారు.
ఐతే ఇప్పుడు స్వయంగా నాగవంశీనే మాస్ జాతర వాయిదా వెనుక కారణమేంటో వెల్లడించాడు. ఆగస్టులో ప్రచారం జరిగిందే నిజమని ఆయన అంగీకరించాడు. వార్-2 ఫెయిలవడంతో తాను అందరికీ దొరికిపోయానని.. ఆడేసుకున్నారని నాగవంశీ వ్యాఖ్యానించాడు. తన చుట్టూ ఆ టైంలో నెగెటివిటీ ముసురుకుందని.. దాని ఎఫెక్ట్ మాస్ జాతర మీద పడుతుందేమో.. తన వల్ల రవితేజ బలైపోతాడేమో అనిపించి మాస్ జాతర మూవీని తనే వాయిదా వేయించినట్లు నాగవంశీ వెల్లడించాడు.
ఆ సమయానికి సినిమాకు సంబంధించి కొంచెం వర్క్ కూడా పెండింగ్‌లో ఉన్న మాట కూడా వాస్తవమే అని.. కానీ ప్రధానంగా తన మీద ఉన్న నెగెటివిటీ ప్రభావం ఈ సినిమా మీద పడకూడదనే వాయిదా నిర్ణయం తీసుకున్నామని నాగవంశీ చెప్పాడు. మరోవైపు కింగ్డమ్, వార్-2 సినిమాలు ఫ్లాప్ కావడంతో తాను ఆస్తులమ్ముకున్నట్లు, డిప్రెషన్‌తో దుబాయ్ వెళ్లినట్లు జరిగిన ప్రచారంపై నాగవంశీ వ్యంగ్యంగా స్పందించాడు. ఆస్తులమ్ముకుని దుబాయ్ వెళ్లి.. మళ్లీ అక్కడ ఆస్తులు కొనుక్కుని రావడానికి టైం పట్టిందని అతనన్నాడు. ఆస్తులు అమ్ముకున్నవాడిని దుబాయ్‌కి వెకేషన్‌కు ఎందుకు వెళ్తానని నాగవంశీ ప్రశ్నించాడు.