రాజకీయాల్లో ఉన్నవారికి మీడియా అవసరం, మీడియా ప్రాధాన్యం కూడా అవసరం. వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ హాజరైనా మీడియా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరితోనైనా విభేరిస్తారేమో కానీ మీడియాతో మాత్రం విభేదించరు. ఒక్కొక్కసారి వారికి నెగిటివ్ గా వార్తలు రాసినా.. లేక వార్తలు ప్రసారం చేసినా మీడియా సంస్థలతో సర్దుకుపోయే పార్టీలు, నాయకులు ఉన్నారు. ఇది రాజకీయాల్లో సహజం కూడా.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల విషయంలో మీడియా వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకు షర్మిల కు భారీ ఎత్తున మీడియా ప్రచారం కల్పించింది. ఆమె ఏం మాట్లాడినా వార్తలు, విశ్లేషణలు అదేవిధంగా ప్రసారాలు భారీ ఎత్తున చేసింది. ఆ తర్వాత కాలంలో ఇటీవల మీడియా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. సహజంగా కొన్ని వర్గాల మీడియా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటున్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలో టిడిపి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఇటీవల కాలంలో విమర్శిస్తున్న షర్మిలను కొన్ని మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. అయితే తాజాగా విజయవాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి షర్మిల కొన్ని మీడియా సంస్థలను ఆహ్వానించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అదేమంటే తనకు ప్రాధాన్యం ఇవ్వని మీడియా సంస్థలను నేను ఎందుకు పిలవాలి అని ఆమె ప్రశ్నించారు. ఇది తీవ్ర పరిణామంగా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఎందుకంటే మీడియా లేకపోతే పార్టీలకు నాయకులకు ప్రచారం అనేది ఉండదు. పైగా పుంజుకోవాల్సిన పార్టీ లో నాయకులను సమన్వయం చేసుకోవలసిన దశలో ఉన్న కాంగ్రెస్ కు మీడియా అవసరం చాలా ఉంది, ఈ క్రమంలో చేజేతులా షర్మిల మూడు కీలక మీడియా సంస్థలకు ఆహ్వానం పంపకపోవడం, వారు వచ్చిన తర్వాత కూడా తను మాట్లాడనని దురుసుగా వ్యవహరించి కారెక్కి వెళ్లిపోవటం వంటివి మీడియాలో చర్చకు దారి తీసాయి.
అనుకూలంగా రాసినప్పుడు, అనుకూలంగా ప్రచారం చేసినప్పుడు షర్మిల తమకు ప్రాధాన్యం ఇచ్చారని ఇప్పుడు తమను దూరం పెట్టారని సదరు మీడియా సంస్థల్లో ఒక సంస్థ వ్యాఖ్యలు చేయటం మరింతగా షర్మిలకు మైనస్ అయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే విమర్శలు పొగడ్తలు సమానంగా తీసుకునే పార్టీ. అటువంటి దాంట్లో ఉన్న షర్మిల మీడియా విషయంలో ఇంత యాగి చేయటం సరికాదు అన్నది ఆ పార్టీ నాయకులే చెబుతున్న మాట. మరి ముందు ముందు మారుతారేమో చూడాలి.