“మీరే చెప్పండి: ఆ ప్యాలెస్‌ను ఏం చేయమంటారు?!“- అంటూ.. ఏపీ ప్రజలకు రాష్ట్రప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు.. “మీ సూచనలు, సలహాలు మాకు అత్యంత కీలకం. ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతున్నాం. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంటాం.“ అని పేర్కొంది. ఈ మేరకు పర్యాటక శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. సలహాలు.. సూచనలను కేవలం ఈ-మెయిల్ రూపంలో మాత్రమే పంపించాలని కోరడం విశేషం.
విషయం ఏంటి?
వైసీపీ హయాంలో విశాఖలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న రుషికొండను తొలిచేసి.. భారీ ఎత్తున నిర్మాణాలు చేశారు. వీటికి గాను రూ.452 కోట్లను అప్పటి సీఎం జగన్ ధారాపాతంగా ఖర్చు చేశారు. ఇవన్నీ ప్రజల సొమ్ములే. ఈ నిర్మాణాలను అత్యంత ఖరీదైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్నారు. ఓపెన్ ప్లేస్ నుంచి పార్కింగ్ వరకు.. సువిశాలంగా నిర్మించారు. ఇక, టాయిలెట్ కమోడ్‌లు, డైనింగ్ హాల్స్ .. ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖరీదైనదిగానే ఉందని అధికారులు తెలిపారు.
అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దీనికి ముందు జరిగిన ఈ నిర్మాణంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అంచనా వేసుకున్న వైసీపీ అధినేత.. రుషి కొండపై ప్యాలెస్ నిర్మించారు. కానీ ఆయన ఓటమితో దానిని అలానే వదిలేశారు. కూటమి సర్కారు వచ్చినా.. దీనిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలన్న విషయంపై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ఇక్కడ పర్యటించి.. నిర్మాణాలను పరిశీలించారు.
ఈక్రమంలో కొన్ని రోజుల కిందట మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి.. రుషికొండ పై ఉన్న ఈ నిర్మాణాన్ని ఎలావినియోగంలోకి తీసుకురావాలన్న విషయంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అదేసమయంలో ప్రజల నుంచి, పారిశ్రామిక వేత్తల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటుంది. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పర్యాటక శాఖ ప్రజలనుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేసింది.
వారంలోగా తమకు ఈమెయిల్ రూపంలో చెప్పాలని కోరింది. మరి ఆలస్యం ఎందుకు.. 450 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ఎలా వినియోగించాలని భావిస్తున్నారో.. సర్కారుకు మెయిల్ చేయండి. మీ సలహా నచ్చితే.. దానిని అమలు చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉంది.
+ మెయిల్ చేయదలుచుకున్న వారు.. rushikonda@aptdc.inకు సమాచారం చేరవేయొచ్చు. అయితే.. విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు లేకుండా.. చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ భాషలో అయినా.. చెప్పవచ్చు.